కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ఏమాత్రం జవాబు ఇవ్వకుండా.. కనీసం రాజకీయ విమర్శల ఊసెత్తకుండా మోడీ ప్రసంగం సాగింది. దీంతో బీజేపీ శ్రేణులు నిరాశ చెందాయి. విజయ సంకల్ప సభలో అభివృద్ధి అంశాల ఆధారంగానే మోడీ ప్రసంగం కొనసాగింది. హైదరాబాద్ ప్రతిభకు పట్టం కడుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తెలుగులో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు వచ్చిన వారందరికీ మోడీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని.. తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ అన్నారు. తెలంగాణ గడ్డ ఎంతో స్పూర్తి ఇస్తోందని.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని మోడీ చెప్పారు. బడుగు , బలహీన వర్గాల కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు.
భద్రాచలం రాముల వారి ఆశీస్సులు మనకు వున్నాయని ప్రధాని తెలిపారు. తెలంగాణలో ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర పథకాలు అందుతున్నాయని మోడీ చెప్పారు. ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించామని.. హైదరాబాద్ అన్ని రంగాల వారికి అండగా నిలుస్తోందన్నారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. మంత్రంతో తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. ఎనిమిదేళ్లుగా దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రయత్నించామని మోడీ తెలిపారు.
2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్ధతు పలికారని.. 2019 నుంచి తెలంగాణలో పార్టీ బలపడుతోందని ప్రధాని అన్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజల కోసం చాలా చేశామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందని.. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని మోడీ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరిందని ఆయన గుర్తుచేశారు. దళితులు, ఆదివాసీలు,పేదల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చిందన్నారు.
హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని.. బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని ప్రధాని అన్నారు. తెలుగులో టెక్నాలజీ, మెడికల్ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించాలని మోడీ తెలిపారు. మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తున్నామని… రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించామని ప్రధాని అన్నారు. తెలంగాణలో 5 నీటి ప్రాజెక్ట్ లకు కేంద్రం సహకరిస్తోందని మోడీ చెప్పారు.
రైతుల కోసం ఎంఎస్‌పీని పెంచామని.. హైదరాబాద్ లో 1500 కోట్లతో ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మిస్తున్నామని ప్రధాని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ కూడా కేటాయించామని మోడీ చెప్పారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచామని.. ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారిందని ఆయన గుర్తుచేశారు. తమ పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నామని ప్రధాని చెప్పారు. తెలంగాణలో రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణలో 5000 కిలోమీటర్ల నేషనల్ హైవేలను అభివృద్ధి చేశామని ప్రధాని చెప్పారు. మెగా టైక్స్‌టైల్ పార్క్ ను తెలంగాణలో నిర్మిస్తామని మోడీ తెలిపారు.