Sunday, January 19, 2025
HomeTrending Newsరహదారుల భూసేకరణ వేగవంతం చేయాలి - కిషన్ రెడ్డి డిమాండ్

రహదారుల భూసేకరణ వేగవంతం చేయాలి – కిషన్ రెడ్డి డిమాండ్

తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం “భారతమాల పరియోజన” కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో  చేపట్టిన ఈ రహదారుల పనులకు సహకరించాలన్నారు. ఆయా రహదారుల నిర్మాణానికి సహకరించాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – సిఎం కెసిఆర్ కు లేఖ రాశారు.

లేఖలోని ముఖ్యాంశాలు…

మాజీ ఉపప్రధాని, నాటి కేంద్ర హోం మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 17 సెప్టెంబర్, 1948 న నాటి నిజాంల నియంతృత్వ పాలన నుండి విముక్తిని పొంది భారతదేశంలో విలీనమైన నాటినుండి 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటి వరకు దాదాపు 66 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. అదే 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలోనే మరో 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తుంది.

ఇవే కాకుండా, రాష్ట్రంలో మరో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. అందులో ₹32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో (మంజూరు చేయబడినవి/బిడ్డింగ్ దశలో ఉన్నవి/మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నవి) ఉన్నాయి. ఈ 11 జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి 4,332 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ భూమి సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు అనేకసార్లు లేఖలు వ్రాయడం జరిగింది.

అయినప్పటికీ, ఇప్పటి వరకు 284 హెక్టార్ల భూమిని మాత్రమే జాతీయ రహదారుల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేయడం జరిగింది. ఇంకా 4,048 హెక్టార్ల భూమిని జాతీయ రహదారుల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేయవలసి ఉంది. ఆయా జాతీయ రహదారి ప్రాజెక్టుల వివరాలను ఈ లేఖకు అనుబంధంగా మీకు పంపిస్తున్నాను.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి, వేలాది కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన జాతీయ రహదారులు ఆయా ప్రాంతాలలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఎంతగానో దోహదం చేశాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాలలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు తొలగిపోయాయి. అనేకమంది ప్రయాణికుల ప్రమాదాలు కూడా తగ్గాయి. అదే విధంగా ప్రస్తుతం నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సేకరించి ఇచ్చినయెడల ఆయా రహదారి ప్రాజెక్టులు నిర్ధేశించిన సమయంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలుగా ఉంటుంది. తద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది.

కావున, ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా చొరవ చూపించి, ఆయా జాతీయ రహదారి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సకాలంలో అందించి, ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి చేయటానికి వీలుగా చర్యలు తీసుకోగలరని మనవి చేస్తున్నాను.

ధన్యవాదాలు,
భవదీయ

(జి. కిషన్ రెడ్డి)

RELATED ARTICLES

Most Popular

న్యూస్