Saturday, January 18, 2025
HomeTrending Newsజగత్ జనని ఆరాధనతో.. దేశమంతా ఆధ్యాత్మిక శోభ

జగత్ జనని ఆరాధనతో.. దేశమంతా ఆధ్యాత్మిక శోభ

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు కోలాహలంగా జరుగుతున్నాయి. జగత్ జనని ఆరాధనతో దేశంలోని ఆన్ని ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి.  ప్రాంతాలు, పేర్లు వేరైనా… నేడు మహిషాసురమర్ధినీ గా జగన్మాత దర్శనమిస్తోంది. నవదుర్గల్లో ఇదే అత్యుగ్రరూపం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నవరాత్రి వేడుకలు వేర్వేరుగా జరుగుతాయి. ఎవరు ఎలా జరుపుకున్నా ఆ పండుగ పరమార్థం మాత్రం ఒక్కటే ఆదిపరాశక్తి ఆరాధన.

తెలంగాణలో దసరా – బతుకమ్మ..
దసరా పండుగ వచ్చిదంటే అందరి ఇళ్లలోను ఆడబిడ్డల సందడే. ఎన్ని పనులు ఉన్నా బతుకమ్మ పండగకు పుట్టింటికి వస్తారు ఆడబిడ్డలు. బతుకమ్మ అంటే.. బతుకు అమ్మా అని అర్థం. ఆడబిడ్డల పండుగే. రకరకాల పువ్వుల్ని వరసలుగా పేర్చి సాయంత్రం వీధుల్లోకొస్తారు. బతుకునివ్వు బతుకమ్మా అంటూ బతుకమ్మ చూట్టూ తిరుగుతూ పాటలు పాడతారు.

దసరా రోజు సాయంత్రం సమయాల్లో పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని తెలంగాణ ప్రజల నమ్ముతారు. అమ్మవారి పూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకుంటారు. అంతేకాదు దసరా రోజున అలయ్‌-బలయ్‌ అంటారు. ఇది తెలంగాణ సంస్కృతిలో ఐక్యతగా చెప్పుకోవచ్చు.

దక్షిణాది రాష్ట్రాల్లో దసరా..
ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల వారు విజయదశమి రోజున బొమ్మల కొలువు పెట్టుకుంటారు. పేరంటాళ్లను పిలుస్తారు. పురాణాలు చదువుకుంటారు. బొమ్మల కొలువుల్లో పురాణ కథల్లో ఉండే పాత్రల బొమ్మలను అమరుస్తారు. అందులో ముఖ్యంగా మాతా గౌరీదేవీ ఉండాల్సిందే. మహిళలతో పాటు యువతులు కూడా చేరి అమ్మవారి పాటలు పాడుకుంటారు. పసుపు, కుంకుమలతో వాయనాలు ఇస్తారు.

కన్నడనాట దసరా వైభవం :
దసరాను కర్ణాటకవాసులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అయ్యే రోజున ఘట ప్రతిష్ట చేస్తారు. కొత్త మట్టి మూకుడులో మట్టిపోస్తారు. దుర్గాదేవి ప్రతిమను ప్రతిష్టిస్తారు. ఆ మట్టిలో నవధాన్యాలను (గోధుమ, యవలు, పెసలు, శనగలు, కందులు, అలసందలు, నువ్వులు, మినుములు, ఉలవలు) చల్లుతారు. తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తారు. ప్రతీ రోజు ఆ మూకుడులో నీళ్లు పోస్తారు. అలా ఆ విత్తనాలు మొలకలు వస్తాయి. 10వ రోజు దర్గాదేవి పూజ చేసి ఆ ఘటాన్ని(మూకుడు) అమ్మగుడిలో పెట్టి వస్తారు.

గుజరాతీలు నృత్య కొలుపుల దసరా.. 
గుజరాతీలు దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా ప్రత్యేకం. మొదటిరోజు పాటలు పాడుతూ గార్భా, దాండియా నృత్యాలతో అమ్మను కొలుస్తారు. దుర్గామాత ప్రతిమను ప్రతిష్టిస్తారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారి పాటలతో పూజలు చేస్తారు. తొమ్మిది రోజులు సాయంత్రం 9 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు గార్భా, దాండియా నృత్యాలతో అమ్మను ఆరాధిస్తారు. 10వ రోజు ప్రతీ వ్యాపారస్తుడు వారి షాపుల్లో వారి వారి వృత్తికి సంబంధించిన పనిముట్లకు, వాహనాలకు పూజ చేస్తారు. చివరి రోజు దసరా రోజు అమ్మను కొలిచి, వెళ్లిరావమ్మా అంటూ దుర్గామాత ప్రతిమలను గంగ ఒడికి చేర్చి నిమజ్జనం చేస్తారు.

మలయాళీల వాగ్దేవి ఆరాధన 
వాగ్ధేవి అంటే సరస్వతీ దేవి. దక్షిణ భారతదేశంలో కేరళ ప్రత్యేకమైనదనే చెప్పాలి. కేరళను దేవతలు నడయాడిన భూమి అంటారు. విజయదశమి రోజున కేరళవాసులు ప్రత్యేకంగా విద్య పూజ చేస్తారు. పిల్లలందరి చేత దసరా రోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతీ పూజ చేస్తారు.

ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానాల్లో రావణ దహనమే దసరా వేడుక
లంకేశుడైన రావణుణ్ణి శ్రీరాముడు దసరా రోజున వధించాడనీ నమ్ముతారు. అందుకే విజయదశమి రోజున ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానా వాసులు రావణప్రతిమను దహనం చేస్తారు. దీన్నే రావణ దహనం అంటారు. ఢిల్లీలోని రామలీల మైదానంలో పెద్ద ఎత్తున ఈ  రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. నిజాం కాలంలో వచ్చి హైదరాబాద్ లోనే స్థిరపడిన ఉత్తరభారతీయులు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు.

బెంగాలీల దుర్గా పూజ
శరన్నవరాత్రులు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది బెంగాలీ దుర్గాపూజ. కలకత్తా కాళీ. దసరాను దుర్గాపూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిథులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను దర్శిస్తారు. తొమ్మిది రాత్రులు కలకత్తా కాళీపూజకు దేశవ్యాప్తంగా పేరుంది. మొదటి మూడు రోజులు అమ్మవారిని పూలు, పండ్లతో పూజిస్తారు. బెంగాల్‌లో అమ్మవారికి జంతుబలి ఇస్తారు. విజయదశమి రోజున అమ్మవారి ప్రతిమను నీటిలో నిమజ్జనం చేస్తారు.

ఒరిస్సాలో దశమి పూజ 
ఒరిస్సా వాసులకు పెద్ద పండుగ అంటే దసరాయే. విజయ దశమి 10 రోజుల ముందు నుంచి అమ్మవారి పూజ ప్రారంభమవుతుంది. ఒరిస్సాలో మాత్రం దీనికి పూర్తి భిన్నం. విజయదశమి నుంచి 10 రోజులు పూజిస్తారు. అమావాస్యను కూడా పవిత్రమైన రోజుగా భావిస్తారు. దేవీ పూజలో వచ్చే అమావాస్యనాడు ప్రత్యేక ఆరాధన చేస్తారు. దసరా తర్వాత దుర్గాపూజ నుంచి 10 రోజులూ రోజుకి 10 రకాల నైవేధ్యాలతో జగన్మాతను కొలుస్తారు.

మహారాష్ట్రలో..
దసరా పండుగను నవ చండీ పూజగా జరుపుకుంటారు మహారాష్ట్ర వాసులు. ఆశ్వీయుజ మాసం ప్రారంభం అయిన మొదటి రోజునే అమ్మవారిని అత్యంత ఘనంగా ప్రతిష్టిస్తారు. సంప్రదాయంలో పూజిస్తూ పవిత్ర కలశం పెడతారు. కలశం చుట్టూ మట్టిపోస్తారు. గోధుమ, వరి, జొన్న గింజలు చల్లుతారు. అదే ఘట ప్రతిష్టాపన. తొమ్మిది రోజులు ప్రతీ రోజు పూజిస్తారు. తొమ్మిదో రోజు హోమం చేస్తారు. 10వ రోజు ఆయుధ పూజ చేస్తారు. అదేరోజు అమ్మవారి ఘటాన్ని పక్కకు జరుపుతారు. మట్టిలో మొలిచిన మొలకలతో అమ్మవారిని పూజిస్తారు. పూజ తరువాత అమ్మవారి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడంతో మరాఠా వాసుల దసరా వేడుకలను ముగిస్తారు.

దసరా వేడుకలు కేవలం సంతోషాన్నే కాదు కొందరికి ఆదాయాన్ని కూడా తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో దసరా వేడుకలు రూ.40 వేల కోట్ల వ్యాపారానికి వేదికయ్యాయి. అంతేకాదు ఏకంగా సుమారు మూడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ మేరకు ఫోరమ్‌ ఫర్‌ దుర్గాస్తాబ్‌(ఎఫ్‌ఎఫ్‌డీ) ఛైర్మన్‌ పార్థో ఘోష్‌ సోమవారం వెల్లడించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 వేల దుర్గా మండపాలను ఏర్పాటు చేశారు. ఒక్క కోల్‌కతాలోనే ఇవి మూడు వేలున్నాయి. వీటికి సంబంధించి ప్రతి సంవత్సరం మూడు నాలుగు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి’ అని ఆయన వివరించారు. ‘‘ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన ప్రజలు భాగస్వాములవుతారు. ముఖ్యంగా మండపాలు నిర్మాణదారులు, విగ్రహాల రూపకర్తలు, ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, పూజారులు, వాద్యకారులు, కూలీలు, కేటరింగ్‌ సేవలందించేవారు ఉంటారు’’అని ఘోష్‌ తెలిపారు.

Also Read: ఖతర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్