Friday, January 24, 2025
HomeTrending NewsSudan crisis: సుడాన్‌ సంక్షోభం

Sudan crisis: సుడాన్‌ సంక్షోభం

ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతున్నది. ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య జరుగుతున్న భీకర పోరాటం తారా స్థాయికి చేరుతున్నది. ఇప్పటికే సుమారు 500 మంది ప్రజలు చనిపోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య ఫైట్‌ రెండో వారానికి చేరింది. దీంతో సుడాన్‌లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన యుద్ధ విమానాలు, నేవీకి చెందిన యుద్ధ నౌకను సిద్ధంగా ఉంచినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సుడాన్‌లో యుద్ధ తీవ్రత, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది.

సుడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సుడాన్‌ అధికారులతోపాటు ఐక్యరాజ్యసమితి, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్‌ ప్రభుత్వ వర్గాలతో నిరంతరం సంప్రదిస్తున్నట్లు పేర్కొంది. వేగంగా స్పందించేందుకు భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీ-130జే విమానాలు ప్రస్తుతం జెడ్డాలో సిద్ధంగా ఉన్నాయి. నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ సుమేధ కూడా సుడాన్‌ పోర్ట్‌కు చేరుకుంది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సుడాన్‌లో సుమారు 4,000 మంది భారతీయులు చిక్కుకున్నట్లు అధికార గణాంకాల ద్వారా తెలుస్తున్నది.ఖార్తోమ్‌లోని రాయబార కార్యాలయం నుంచి దౌత్య ప్రతినిధులు, సిబ్బందిని అమెరికా ఖాళీ చేయించింది. అమెరికా సైన్యం సహకారంతో దౌత్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను సురక్షితంగా సుడాన్‌ నుంచి బయటకు తరలించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్