Sunday, January 19, 2025
Homeసినిమానజ్రియాకి టాలీవుడ్ నచ్చేసినట్టే!   

నజ్రియాకి టాలీవుడ్ నచ్చేసినట్టే!   

New commer: నజ్రియా అంటే అందం .. నజ్రియా అంటే అభినయం. యాక్టింగ్ ఆమెకి కొత్తకాదు .. చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది. ఆ తరువాత టీనేజ్ లోకి అడుగుపెడుతూనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. హీరోయిన్ గా  ఆమె కెమెరా ముందుకు వచ్చి కూడా పదేళ్లు అవుతోంది. మలయాళ .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అందమైన కళ్లతో ఆమె పలికించే హావభావాలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. అక్కడి యూత్ లో ఎక్కువమంది ఆమె అభిమానులే. ఆ సినిమాలు అనువాదాలుగా తెలుగులో రావడం వలన, ఇక్కడ కూడా ఆమె ఆరాధకుల సంఖ్య ఎక్కువే.

తమిళ .. మలయాళ సినిమాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఆమె అక్కడ చేసింది చాలా తక్కువ సినిమాలే. కారణాలేవైనా ఆమె సినిమాల మధ్య చాలా గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. కథల విషయంలో ఆమెను ఒప్పించడం కష్టమనే విషయం ప్రచారంలో ఉంది. టాలీవుడ్ వైపు రావడానికి కూడా ఆమె ఎప్పుడూ ప్రయత్నించలేదు. అలాంటి ఆమెను వివేక్ ఆత్రేయ – నాని కలిసి ‘అంటే .. సుందరానికీ’ సినిమా కోసం ఎలాగో ఒప్పించారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో దిగిపోనుంది. ఇక్కడి ఆమె ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నజ్రియా చురుకుగా పాల్గొంటోంది. టాలీవుడ్ తనకి బాగా నచ్చేసిందనీ,   ఇలాంటి ఒక మంచి వాతావరణంలో ఈ సినిమా చేయడం హ్యాపీగా ఉందని చెబుతోంది. నిర్మాతలు తనని ఎంతో బాగా చూసుకున్నారనీ .. వివేక్ ఆత్రేయ తనకి ఏదైతే చెప్పాడో అదే తెరపై చూపించాడని అంది. ఇకపై వివేక్ ఆత్రేయ అడిగితే ఎలాంటి ఆలోచన లేకుండా డేట్స్ ఇచ్చేస్తానని చెప్పింది. దీనిని బట్టి చూస్తుంటే ఈ సుందరి తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగానే అనిపిస్తోంది. అదే ఆమె ఉద్దేశమైతే మిగతా భామలకు పోటీ తప్పనట్టే!

Also Read : అందాల నజ్రియాలో ఆనాటి గ్లామర్ ఏది?  

RELATED ARTICLES

Most Popular

న్యూస్