Friday, November 22, 2024
HomeTrending Newsమరో రెండేళ్ల వరకు కరోనా ఉద్ధృతి

మరో రెండేళ్ల వరకు కరోనా ఉద్ధృతి

దేశంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు కఠిన జాగ్రత్తలు అవసరమని దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యుడు నీరజ్‌ నిశ్చల్‌ సూచించారు.  మరో రెండేళ్ల వరకు కరోనా తగ్గుముఖం పట్టదని, అప్పటివరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.  ప్రస్తుతం పండగల నేపథ్యంలో ప్రజలు గుమిగూడటాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  దేశంలో కరోనా రెండో దశ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు.

కాగా దేశంలో మూడో దశ కూడా మొదలైందని కొందరు నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఇది రెండో దశ అంత ప్రమాదకం కాదని పేర్కొంటూనే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యుడు నీరజ్‌ నిశ్చల్‌ మాట్లాడుతూ.. దేశంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు కఠిన జాగ్రత్తలు అవసరమని సూచించారు.  వైరస్‌ మళ్లీ తీవ్రతరం కాకుండా ప్రతిఒక్కరు అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు.  ప్రస్తుతం కొనసాగుతున్న పండగలు, మరికొద్ది రోజుల్లో రానున్న మరికొన్ని పండగల నేపథ్యంలో ప్రజలు గుమిగూడటాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 ‘రెండో దశ సృష్టించిన భయానక పరిస్థితుల నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం. పండగలు జరుపుకునేది సంతోషాన్ని పంచుకునేందుకు.. కొవిడ్‌ వ్యాప్తి చేసేందుకు కాదు. మరో రెండేళ్ల వరకు కరోనా తగ్గుముఖం పట్టదు. అప్పటివరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొవిడ్‌ ఉద్ధృతికి మనం కారణం కాకూడదు’ అని పేర్కొన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్‌ ప్రారంభమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) హెచ్చరించిన నేపథ్యంలో.. రానున్న 100 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం స్పష్టం చేసింది.  చాలా దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని హెచ్చరించింది.  యావత్‌ ప్రపంచం మూడో ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న వేళ.. భారతీయులు బాధ్యతగా వ్యవహరించి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది.

దేశంలో చాలా మందికి వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఇన్‌ఫెక్షన్‌ నుంచి కూడా మనం ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీ పొందలేదని నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌ పేర్కొన్నారు.  వ్యాక్సినేషన్‌ ద్వారానే దీన్ని పొందాల్సి ఉంటుందన్నారు. థర్డ్‌వేవ్‌ ప్రారంభమయ్యిందా లేదా అనేది ముఖ్యం కాదని.. వైరస్‌ను ఏమేరకు ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యమని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్