కాలం మారుతోంది. చదువులు అక్కర్లేనివి కూడా నేర్పిస్తున్నాయి. చాలాసార్లు ఎవరు ఎందుకు స్పందిస్తున్నారో తెలియడం లేదు. జాతి వివక్ష, కులాల కార్చిచ్చు, సంస్కృతీ వైరుధ్యాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటికి ప్రకటనలు మినహాయింపు కాదు. రంగు, రూపం, ప్రాంతం ఆధారంగా రూపొందించే కొన్ని ప్రకటనలు సృష్టించే అపార్థాలు అన్నీ ఇన్నీ కావు. ఆ మధ్య మన దేశంలో ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటి గొడవతోనే తమ ఉత్పత్తిని “గ్లో అండ్ లవ్లీ” గా మార్చి బతికిపోయింది.
తాజాగా నెస్లే కంపెనీ ఇలాంటి వివాదంలోనే ఇరుక్కుంది. అయితే ఇందుకు వేదిక చిలీ దేశం. అక్కడ నెగ్రిటా అనే చాక్లెట్ కుకీస్ 60 ఏళ్లుగా అమ్ముడవుతున్నాయి. నెగ్రిటా అనే పదానికర్థం ‘ నల్ల పిల్లవాడు’. అదే పెద్ద వ్యక్తిని ‘నెగ్రిటో’ అంటారట. ఇది జాత్యహంకారాన్ని సూచిస్తోందని నిరసనలు వెల్లువెత్తాయట. ఈ ప్రకటనలో పాల్గొన్నందుకు గాను ఉరుగ్వే ఫుట్ బాల్ స్టార్ ఎడిసన్ కవని జరిమానా చెల్లించాల్సి వచ్చిందట. దాంతో నెస్లే కంపెనీ స్పందించి చిలీ వాసుల మనోభిప్రాయాలు గౌరవిస్తామని ఇకనుంచీ నెగ్రిటా కుకీలు ‘చొకిట’ అనే పేరుతో అమ్ముతామని తెలిపింది. ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది అమ్మడం, అనెయ్యడం ఇక ముందు కుదరదన్న మాటే!
-కె. శోభ