జమ్ముకశ్మీర్ లో ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమయాత్తం అవుతుండగా మరోవైపు కేంద్ర ప్రభుత్వం లడఖ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు (సోమవారం) వెల్లడించారు. ఈ మేరకు ఐదు జిల్లాల పేర్లను ఎక్స్ వేదికగా ప్రకటించారు. జన్‌స్కార్ (Zanskar), డ్రాస్ (Drass), షామ్ (Sham), నుబ్రా (Nubra), చాంగ్‌తాంగ్ (Changthang) జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులకు ప్రభుత్వ వ్యవసతను మరింత చేరువ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు కార్గిల్, లెహ్ జిల్లాలు ఉండగా కొత్త వాటితో కలిపి ఏడు జిల్లాలు అవుతున్నాయి. లడఖ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ లో పోస్టు చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్రం తాజా నిర్ణయం జమ్ముకాశ్మీర్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. అటు విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కాశ్మీర్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేంద్రం కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం తీసుకుందని విమర్శలు చేశాయి. బిజెపి రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే సూచనలు ఉన్నాయి.
-దేశవేని భాస్కర్