యష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యష్‌రాజ్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘నీకు… నాకు… రాసుంటే…’. ‘గణా’ చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్. వర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈశ్వర్, సాయివిక్రాంత్, రిషి, సూర్య ప్రధాన హీరోలుగా నటిస్తున్నారు. స్రవంతి పలగని, అభిషేక్ ఆవల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సాంగ్ రికార్డింగ్, బ్యానర్ లాంచింగ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది.
ఈ సందర్భంగా ప్రముఖ గాయని సునీత మాట్లాడుతూ.. తెలుగులో యశ్‌రాజ్ పేరుతో బ్యానర్ స్థాపించడంతోనే సగం విజయం సాధించారు నిర్మాతలు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం దర్శకులు వర్మ గారే 24 క్రాఫ్ట్స్ చేస్తున్నారు. ఇదో మంచి ప్రయోగంగా మిగిలిపోవాలి. యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెస్. నేను లైవ్‌లో ఓ సినిమాకు పాట పాడటం ఇదే తొలిసారి. ఇది కూడా ఓ రికార్డ్ అనుకుంటా. నాకు ఈ ప్రయోగాత్మక చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
దర్శకుడు కె.ఎస్. వర్మ మాట్లాడుతూ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన నటీనటులు పని చేస్తున్నారు. ప్రపంచ రికార్డు కోసం 24 క్రాఫ్ట్స్ ను నేనే నిర్వహిస్తున్నాను. దీన్ని లైవ్ రికార్డు కూడా చేస్తాం. తప్పకుండా మా కష్టానికి తగ్గట్టుగా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. మా సినిమాలో జాతీయ అవార్డు పొందిన ఓ ప్రముఖ హీరోయిన్ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు. ఇందుకు చర్చలు జరుగుతున్నాయి అన్నారు.