Diversion Politics: ప్రజా సమస్యలు, ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. పాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన ప్రక్రియ ఉండాలి కానీ కొత్త సమస్యలు తలెత్తేలా నిర్ణయాలు ఉండకూడదని హితవు పలికారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తామెందుకు వ్యతిరేకిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను ఎవరు గౌరవించినా స్వాగతిస్తామన్నారు. ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదని, ఆయనకు భారత రత్న ఇవ్వాలని టీడీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందని బాబు చెప్పారు. హైదరాబాద్ లో ఎయిర్ పోర్టుకు నాడు ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొలగించారని బాబు విమర్శించారు. వైఎస్ పేరు కడప జిల్లాకు పెట్టినప్పుడు తాము వ్యతిరేకించలేదన్నారు.
టీడీపీకి ద్వంద్వ విధానాలు ఉండబోవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తూ.. అమరావతిలో ఎన్టీఆర్ స్మృతి వనం ప్రాజెక్టును నిలిపేశారని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ పై తమకు ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నాన్ని ప్రజలు నమ్మరబోరన్నారు. చివరికి ఎన్టీఆర్ పేరున ఉన్న అన్నా క్యాంటీలను కూడా జగన్ నిలిపి వెయ్యడం నిజం కాదా అని ప్రశ్నించారు.
వైసీపీలోనే కొత్త జిల్లాల నిర్ణయంపై వ్యతిరేకత వస్తోందని బాబు ప్రస్తావించారు. తొందరపాటు నిర్ణయాలతో ఇప్పటికే రాష్ట్రానికి జగన్ రెడ్డి తీవ్ర నష్టం చేశారని, ఇప్పుడు అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి వస్తుందని బాబు అంచనా వేశారు. కనీసం కేబినెట్లో కూడా సమగ్రంగా చర్చించకుండా.. రాత్రికి రాత్రి నోటిఫికేషన్ విడుదల చెయ్యాల్సిన అవసరం ఏముందన్నారు. 21వ తేదీ జరిగిన కేబినెట్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎటువంటి చర్చ జరగలేదని, 25వ తేదీ రాత్రికి రాత్రి మంత్రులకు నోట్ పంపి ఆమోదం పొందాల్సినంత అత్యవసర పరిస్థితి ఏమొచ్చినదని బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధానుల తరలింపు, జిల్లాల ఏర్పాటు వంటి కీలక అంశాలపైనా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని బాబు మండిపడ్డారు. గుడివాడలో క్యాసినో వ్యవహారాన్ని వదిలేది లేదు, పోరాటం కొనసాగిస్తామని బాబు వెల్లడించారు.
Also Read : చరిత్రలో ఇలాంటి పీఆర్సీ లేదు: సోము