Sunday, September 8, 2024
HomeTrending NewsRTC: కొత్తగా 2500 బస్సుల కొనుగోలు: విశ్వరూప్

RTC: కొత్తగా 2500 బస్సుల కొనుగోలు: విశ్వరూప్

ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో అత్యధిక పెన్షన్‌ విధానం (హైయ్యెస్ట్‌ పెన్షన్‌ సిస్టమ్‌) అమలు కానుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. దీనికోసం పీఎఫ్‌ ఫండ్‌ ట్రస్ట్‌కు తెలంగాణతో సహా   పలు  రాష్ట్రాల సంస్థలు దరఖాస్తు చేసినా, సిఎం జగన్ చొరవ  కారణంగా మన రాష్ట్రానికి అవకాశం దక్కిందన్నారు.  50 వేలకు పైగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం కాగా, వారితో పాటు.. 2014 తర్వాత రిటైర్‌ అయిన దాదాపు 10,200 మంది ఉద్యోగులు, కార్మికులు అత్యధిక పెన్షన్‌ విధానంతో  ప్రయోజనం పొందుతారని వివరించారు. ప్రస్తుతం  ఉద్యోగులకు ఒక్కొ క్కరికి రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు పెన్షన్‌ రాబోతోందని,  గతంలో కేవలం రూ. 3 వేల నుంచి రూ. 4 వేల మాత్రమే వచ్చేదని తెలిపారు.

ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు దాదాపు రూ. 10,570 కోట్ల జీతాలు చెల్లించిందని, కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ మూలధనాన్ని ముట్టుకోక పోవడం వల్ల.. సంస్థ మనుగడ కొనసాగిస్తోందని అన్నారు. సిఎం చూపిన చొరవ వల్ల, సంస్థ అప్పుల నుంచి బయట పడడమే కాకుండా, ఉద్యోగులు, కార్మికులకు ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు. చంద్రబాబు హయాంలో ప్రావిడెంట్‌ నిధుల నుంచి దాదాపు రూ. 996 కోట్లు తీసుకుంటే, ఆ మొత్తాన్ని (అప్పు) కూడా సంస్థ తీర్చిందని,  సీసీఎస్‌కు కూడా దాదాపు రూ.269 కోట్ల రుణాలు చేలించిందని మొత్తంగా రూ. 2553 కోట్ల రుణ భారం నుంచి బైట పడిందన్నారు. కొత్తగా 1500 డీజిల్‌, 1000 విద్యుత్‌ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.  ప్రతి ఉద్యోగికి రూ. 40 లక్షల ప్రమాద బీమా, రూ. 5 లక్షల సహజ మరణ బీమా సదుపాయం కల్పిస్తున్నామని,  ఇప్పటికే 390 కుటుంబాలకు ఆ బీమా ద్వారా లబ్ధి చేకూరిందని చెప్పారు.

వాలంటీర్ల వ్యవస్థపై జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విశ్వరూప్ స్పందించారు. “వలంటీర్లు గ్రామాల్లోనే ఉంటారు. వారు స్థానికులు. ఆ 50 ఇళ్ల నుంచే ఎవరో ఒకరు పని చేస్తారు. ఈ వ్యవస్థను దేశంలో చాలా మంది హర్షించారు. వలంటీర్ల సేవలు గణనీయం. ప్రతి నెలా 1వ తేదీన ఇంటి తలుపు తట్టి, పెన్షన్‌ ఇస్తున్నారు. అయినా వారిపై విషం చిమ్ముతూ దుష్ప్రచారం చేస్తున్నారు.  ఈరోజు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయంటే అందుకు వలంటీర్లే కారణం. నిజంగా వలంటీర్ల వ్యవస్థ బాగాలేకపోతే, మీకు నచ్చకపోతే, అధికారంలోకి వస్తే, దాన్ని రద్దు చేస్తామని మీరు ధైర్యంగా ఎందుకు ప్రకటించలేకపోతున్నారు” అంటూ విశ్వరూప్‌ ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్