Monday, January 20, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహ్యాపీ న్యూ ఇయర్

హ్యాపీ న్యూ ఇయర్

Date & Time: దేనికయినా టైమ్ రావాలి. ఎవరికయినా టైమ్ బాగుండాలి. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. కాలో జగద్భక్షకః – జగత్తును కాలం తినేస్తూ ఉంటుంది. కాలోహి బలవాన్ కర్తా – కాలమే అన్నిటికంటే బలమయినది. విష్ణువు రెండు కళ్లు సూర్య చంద్రులు. సూర్య చంద్రుల గమనమే కాలం. అందుకే కాలం మనకు దైవ స్వరూపం.

మంచి కాలం ఉన్నట్లే చెడు కాలం కూడా ఉంటుందనే నమ్మికతోనే వర్జ్యం, రాహుకాలం, యమగండాలను తప్పించుకునేందుకు తిథి వార నక్షత్రాలను చూస్తుంటాం. సుముహూర్తే సావధాన…అని దేవ దేవుడి పెళ్లికయినా మంచి టైమ్ చూడాల్సిందే.

మన గడియారాల్లో బ్యాటరీ అయి పోవడం వల్ల టైమ్ లేట్ కావచ్చు. ముందుగా తిరగవచ్చు. కానీ కాల చక్రం మాత్రం యుగయుగాలుగా గతి తప్పదు. మతి తప్పదు.

పాడు కాలం.
మంచి కాలం.
కష్ట కాలం.
కొంత కాలం.
ఎండా కాలం.
వానా కాలం.
చలి కాలం.
పరీక్షల కాలం.
జీవిత కాలం.

ఇలా ప్రతి క్షణం, ప్రతిదీ కాలానికి లోబడి ఉండాల్సిందే. కనురెప్ప పడే కాలమే నిమిషం. కనురెప్ప పడదు కాబట్టే దేవతలు అనిమేషులు. నిమిషాలతో మొదలై గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు, యుగాలు, కల్పాలు, బ్రహ్మ కల్పాల దాకా అన్ని లెక్కలు కాలానికి ఆధీనమై ఉన్నవే. అన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సినవే.

మావి చిగురు తినగానే కోయిల పాడుతుందా?
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడుగుతుందా?
వసంతం వస్తోందని తెలిసి ప్రకృతి పురివిప్పి హొయలు పోతుందా?
ప్రకృతి పరవశిస్తోందని తెలిసి వసంతమొస్తోందా?
బండలు పగిలే ఎండలు పోగానే-
ఆకాశానికి చిల్లులు పడే వర్షాలను కురవమని చెబుతున్నదెవరు?
ఊరూ వాడా మునిగిపోయే వర్షాలు కాగానే ఎముకలు కొరికే చలి మంచును చల్లుతున్నదెవరు?
ఎండల్లోనే పండాలని మామిడికి టైమింగ్ ను సెట్ చేసిందెవరు?
ఎండల్లో గుండు మల్లెల మత్తు చల్లడానికి టైమింగ్ ను సెట్ చేసిందెవరు?
ఏ రుతువులో కాలం ఎలా ఉండాలో? ఎలా ఉండకూడదో? నియంత్రిస్తున్నదెవరు? పర్యవేక్షిస్తున్నదెవరు?

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగమన్నదెవరు? అలా తిరక్కపోతే మనకు రాత్రి పగళ్లు ఉండేవా? బతుకంతా చీకటే అయితే మన బతుకులు ఈమాత్రం అఘోరించేవా? బతుకంతా పగలే అయితే నిదురలేని లోకం పిచ్చిదైపోదా?

కాలానికి నియతి స్వభావం. కాలం దొర్లకపోతే కాలం గడవని లోకం పిచ్చిదైపోతుంది. పడమటి కొండల్లో దిగులుగా దిగిన సూర్యుడు తూరుపు కొండల్లో నవ్వుతూ నిదుర లేపడానికి రావాల్సిందే. కురిసే మబ్బులు, ఉరిమే ఉరుములు, మెరిసే మెరుపులు, పూచే పువ్వులు, వీచే గాలులు, పెరిగే వయసులు, రాలే ఆకులు…సర్వం…సమస్తం కాలం చేతి మాయాజాలాలే.

పొద్దుపొడుపు- వాలే పొద్దు మధ్య నడవాల్సిన మనకు కాలమే తోడు నీడ. కాలంతో పరుగులు పెట్టాలి. కాలానికి ఎదురీదుతున్నామనుకుంటూ, కాలగతిలోనే కొట్టుకుపోతూ ఉంటాం. గడిచిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కు తీసుకురాలేం. రావాల్సిన ఒక్క క్షణాన్ని కూడా ముందుగానే తీసుకురాలేం. కాలకృతి చేతిలో కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన వాళ్లం.

అనంతకాలానికి ఆది లేదు. తుది ఉండదు. కానీ మనకు మాత్రం ఆది- అంతాలు ఉంటాయి. ఉండి తీరాలి. మనం కాలానికి అతీతులం కాము. కాలాతీత విఖ్యాతుడు పరబ్రహ్మ ఒకడే ఉంటాడని త్యాగయ్య స్పష్టంగా చెప్పాడు.

మనవన్నీ దిన చర్యలే. ఉదయం లేవాలి. తినాలి. పడుకోవాలి. మళ్లీ లేవాలి. మళ్లీ పడుకోవాలి. ఇదే పునరపి…పునరపి…

సృష్టికి ఆటోమేటిక్ అలారం ఉంటుంది. దానికి ఇంకొకరు అలారం పెట్టి సమయానికి తగు పనులు చేయాలని చెప్పాల్సిన పనిలేదు. మనకలా కాదు. అలారం తట్టి లేపాలి. గడియారం సమయం చెబుతూ తొందర పెట్టాలి. నిముషాల ముల్లు వేగంగా తిరగాలి. గంటల ముల్లు నెమ్మదిగా నడవాలి. భోజనానికి గంట కొట్టాలి. బడికి గంట కొట్టాలి. పూజకు గంట కొట్టాలి. ఉంటే గుండె గంట కొట్టాలి. పొతే చావు డప్పు కొట్టాలి. గడియారాన్ని చూస్తూ బతకాలి. టైమ్ వచ్చినప్పుడు గడియారాన్ని చూడకుండానే పోవాలి.

సృష్టి గడియారానికి- జీవ గడియారానికి- గోడ మీద లేదా చేతి గడియారానికి అంతర్గతంగా లంకె ఉంటుంది. పగలు పని చేయాలి. రాత్రి పడుకోవాలి. ఇది సృష్టి ధర్మం. మనమిప్పుడు పగలు పడుకుని రాత్రిళ్లు జడలు విప్పి నర్తిస్తున్నాం. అదిక్కడ అనవసరం.

ఆఫీసు వేళలు, ఇతర రోజువారీ కార్యక్రమాలు, సమస్త దైనందిన జీవితం ఈ జీవ గడియారం పరిధిలోనే ఉంటుంది. అలాగే ఉండాలి.

కాలం కొమ్మకు-
చిగురించిన యుగాలెన్నో?
కుసుమించిన పుష్పాలెన్నో?
కాచి…పండి…రాలిపోయిన పళ్లెన్నో?
చీకటి దుప్పటి కప్పుకుని రెప్పవేసిన రాత్రులెన్నో?
వెలుగుపూల రేకులు విచ్చిన వేకువలెన్నో?
వాలిపోయిన పొద్దుల్లో వర్ణాల సుద్దులెన్నో?
రాలిపోయిన కాలం ఆకుల మాటున వినిపించే జ్ఞాపకాలెన్నో?

రానున్న కాలం ఇవ్వనున్న అనుభవాలెన్నెన్నో?

2022 కు వీడ్కోలు చెబుతూ…
2023 కు స్వాగతం చెబుతూ…
నూతన సంవత్సర శుభాకాంక్షలతో…

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్