Friday, January 24, 2025
HomeTrending NewsNIMS: 50 మంది జీవితాల్లో వెలుగు నింపిన నిమ్స్

NIMS: 50 మంది జీవితాల్లో వెలుగు నింపిన నిమ్స్

ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో 50 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి నిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా సాధ్యం కాని ఈ ఘనతను నిమ్స్ వైద్యులు సాకారం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ప్రభుత్వ సహకారంతో రోగికి 15 లక్షల విలువైన ఉచిత చికిత్సను ప్రభుత్వం అందిస్తున్నది. నిమ్స్ తో పాటు గాంధీ, ఉస్మానియాల్లో గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాల మార్పిడి సర్జరీలను ప్రభుత్వం అరోగ్య శ్రీ కింద ఉచితంగా అందిస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి నిమ్స్ ఆసుపత్రి చరిత్రలో 862 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు (522 లైవ్, 340 కాడవర్ కేసులు) జరిగాయి.
2015 నుండి, ప్రతి సంవత్సరం సగటున 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. గత ఏడాది 2022లో 93 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఈ ఏడాది కేవలం నాలుగు నెలల్లోనే ఆరోగ్యశ్రీ కింద 50 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు (28 లైవ్, 22 కాడవర్ కేసులు) విజయవంతంగా పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవన్‌ధన్ కార్యక్రమం ద్వారా చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూత్రపిండ మార్పిడి ఆపరేషన్‌ను అతి తక్కువ సమయంలో చేస్తున్నారు. నిమ్స్ యూరాలజీ వైద్యులు మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లతో పాటు ఎటువంటి అంతరాయం లేకుండా ఇతర యూరాలజీ శస్త్రచికిత్సలను కొనసాగిస్తున్నారు.

నిమ్స్ యూరాలజీ టీమ్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ప్రొఫెసర్ & హెచ్‌ఓడి, డా.సి.హెచ్.రామ్ రెడ్డి ప్రొఫెసర్, డా.ఎస్.విద్యా సాగర్, డా.జి.రామచంద్రయ్య, డా.జి.వి.చరణ్ కుమార్, డా. ధీరజ్, డా.అరుణ్‌కుమార్, డా.సునీల్, డా.వినయ్, డా.విష్ణు, డా.జానకి, డా.పవన్, డా.హర్ష, డా.పూవర్సన్, డా.సూరజ్, డా.షారుఖ్, డా.అనంత్ మరియు అనస్తీషియా బృందం డాక్టర్.నిర్మల ,డా. ఇందిర, డాక్టర్ కిరణ్, డాక్టర్ షీబాని మరియు నెఫ్రాలజీ బృందం డాక్టర్ టి. గంగాధర్, డా.శ్రీభూషణ్ రాజు, డా.జి.స్వర్ణలతలు ఇందుకు కృషి చేసిన వారిలో ఉన్నారు.

ఆర్గాన్ డొనేషన్స్ లో తెలంగాణ టాప్
4 నెలల్లో 50 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసి, పునర్జన్మను ప్రసాదించిన నిమ్స్ వైద్యలను ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అభినందించారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అత్యంత ఖరీదైన వైద్యం పేదలకు చేరువయ్యిందని, తద్వారా అనేక మంది అవయవ మార్పిడి బాధితులకు పునర్జన్మ లభిస్తుందని కొనియాడారు. గాంధీ ఆసుపత్రిలో రూ. 35 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది పూర్తయితే సేవలు మరింత విస్తృతం అవుతాయి. ఆర్గాన్ డొనేషన్ లో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. అవయవదానం ప్రోత్సహించి, జీవన్ దాన్ లో నమోదు చేసుకొని ఎదురు చూస్తున్న వారికి నిండైన జీవితం అందించాలని పిలుపునిస్తున్నాను.

RELATED ARTICLES

Most Popular

న్యూస్