శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర లో మరియు ఉత్తర తెలంగాణలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. వరద నీటిని గోదావరి నది లోకి వదిలే అవకాశం ఉన్నది. రెవిన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొవలసిందిగా మరియు గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను కోరారు.
నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా చూడాలని, చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా మీడియా, పోలీస్,రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో నీటి మట్టం ప్రమాదకర రీతిలో పెరిగింది. అంతకంతకు పెరుగుతున్న వరదతో కడెం ప్రాజెక్టుకు పైనుంచి వరద ప్రవాహం పోటెత్తింది. వరద నీరు సామర్థ్యానికి మించి పారుతోంది. ప్రాజెక్టు కు చెందిన 4 గేట్లు మొరాయిస్తుండగా, వరద నీటిలో వస్తున్న చెట్ల కొమ్మలు ప్రమాదకరంగా మారాయి.
అధిక వర్షాలకు కడెం ప్రాజెక్ట్ తెగే అవకాశం ఉన్నందున జన్నారం మండల కడెం ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలైన కలమడుగు, ధర్మారం, బాధంపల్లి , చింతగూడ, రోటీగూడ, తపాలపూర్ , తిమ్మా పూర్, రాంపూర్ గ్రామాల లోతట్టు ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరళి వెళ్ళాలని జన్నారం తహసీల్ధార్ విజ్ఞప్తి చేశారు.
అటు జగిత్యాల జిల్లాకు పెద్దపల్లి జిల్లాతో రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల- ధర్మారం – పెద్దపల్లికి రాకపోకలు బంద్ అయ్యాయి. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ రోడ్డం పై పొంగుతున్న వాగుతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంకోవైపు జగిత్యాల – ధర్మపురి ప్రధాన రహదారిపై నిలిచిన రాకపోకలు. రూరల్ మండలం లోని అనంతారం గ్రామ బ్రిడ్జిపై వరద నీరు వ్రవహిస్తుండడంతో పోలీసులు జగిత్యాల – ధర్మపురి రాకపోకలు నిలిపివేశారు.