“జోగద సిరి బెలకినల్లి;
నిత్యోత్సవ తాయి నిత్యోత్సవ …..” కన్నడ గీతం.
మనకు వేదంలా ఘోషించే గోదావరి పాటలా…జోగ్ జలపాతం మీద కన్నడ మాట్లాడేవారందరి నోళ్ళలో నానే పాట ఇది . కవి నిస్సార్ అహ్మద్(1936-2020)వృత్తి రీత్యా జియాలజీ అధ్యాపకుడు. కన్నడ సాహితీ హిమవన్నగం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కువెంపుతో పరిచయం నిస్సార్ ను గొప్ప కవిగా మార్చింది. బదిలీలవుతూ ఒకసారి శివమొగ్గ జిల్లాలో నిస్సార్ ఉద్యోగం చేసేవారు. అంతే -అక్కడికి దగ్గరలోని జోగ్ జలపాతం ప్రేమలో పడిపోయారు. శరావతి నది దూకే జోగ్ జలపాతం చూడాలి కానీ – అంతటి జలపాతాన్ని మాటలు ఏమి మోస్తాయి?
అయితే నిస్సార్ వదిలిపెట్టలేదు. హోరున దూకే జలపాతాన్ని తన పదాల్లో బంధించారు. జోగ్ తల్లికి ఒక నిత్యహారతిని కానుకగా ఇచ్చారు. ఆనాటినుండి ఈనాటి వరకు…ఆమాటకొస్తే ఇక ఎప్పటికీ ఇంతకంటే జోగ్ గురించి ఎవరూ చెప్పలేనంత గొప్పగా చెప్పారు. నిస్సార్ రచన తరువాత జోగ్ నేలమీద నడవడం మాని, ఆకాశంలో ఎక్కి కూర్చుందంటారు.
కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలో సాగర్ తాలూకాలో ప్రకృతి పరవశించిన పచ్చని కొండకోనల్లో మహోధృతమయిన నీటి పాయల కుచ్చిళ్ళతో, నురగల గజ్జెలతో, చల్లే తుంపరలతో జోగఫాల్స్ చూడని కనులు కనులే కాదు.
“నిత్యోత్సవం తల్లి నిత్యోత్సవం – నీకు హరితోత్సవం;
జోరుగ ఎగసినట్టి తుంగ గంగ పరవళ్లు;
సహ్యాద్రి స్పర్శతో సందడించి ఉత్తుంగ తరంగాలు;
నిత్య హరిత సస్య భరిత ధాత్రి పట్టుచీరలు;
నిత్యోత్సవం తల్లి నిత్యోత్సవం – నీకు హరితోత్సవం;
దూకే జలపాఠ చరితకు నీవు సింహాసనం;
పొంగే నురగలతో , తరగలతో నీవు జలవాహనం;
సాగే సస్యశ్యామల సీమలతో నీవే పచ్చని తోరణం;
నిత్యోత్సవం తల్లి నిత్యోత్సవం – నీకు హరితోత్సవం;
నీ నడకలు నయాగరా !
నీ దూకుడు హరోం హరా !;
శరావతి హృదిపొంగిన శరజ్యోత్స్నా సాగరం;
శివమొగ్గ విచ్చి శివుని జటాజూటి దాటి;
ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగగా ఎగసేవేళ;
ధగద్ధగద్ధగజ్జ్వలిత జోగ్ జలపాత తాండవం”
ఆ అద్భుతమైన కన్నడ గీతానికి 1990లో నేను చేసిన స్వేచ్ఛానువాదమిది.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018