Saturday, January 18, 2025
HomeTrending Newsఇందూరులో ఎన్నికల జోరు...రైతులు, మహిళలే కీలకం

ఇందూరులో ఎన్నికల జోరు…రైతులు, మహిళలే కీలకం

నిజామాబాదు లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్, బిజెపిలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముగ్గురు అభ్యర్థులు శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసినవారే… లోక్ సభ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తలపడుతున్నారు.

దీని పరిధిలో కోరుట్ల, జగిత్యాల, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాదు అర్బన్, నిజామాబాదు రూరల్, బోధన్, శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు చోట్ల బీఆర్ఎస్, చెరో రెండు స్థానాల్లో కాంగ్రెస్, బిజెపి గెలిచాయి. ఇక్కడ మొత్తం 16 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు.

2004, 2009లో కాంగ్రెస్ నుంచి మధు యాష్కి గెలిచారు. 2014లో బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ బరిలో నిలిచి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి మధుయాస్కీ గౌడ్ పోటీ చేసి ఓటమి చవిచూశారు.

నిజామాబాదు పరిధిలోని రైతాంగం చైతన్యవంతులు. హక్కుల సాధన కోసం రాజకీయ నేతలకు, పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన చరిత్ర ఉంది. ఇక్కడ కుల రాజకీయాల కన్నా రైతాంగ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఉంటుంది. ఎర్ర జొన్నల కొనుగోలు, పసుపు బోర్డు అంశాలే ఇందుకు నిదర్శనం.

బిజెపి నుంచి బరిలో దిగిన సిట్టింగ్ ఎంపి ధర్మపురి అరవింద్ దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పసుపు బోర్డు తీసుకువచ్చానని ధర్మపురి చెపుతుంటే అది నిజామాబాదులోనే అన్నట్టుగా ఏ ఉత్తర్వు లేదని కొన్ని గ్రామాల్లో రైతులు నిలదీస్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఇదివరకే ఎమ్మెల్సీగా ఉండటం… రాజకీయాల్లో సీనియర్ నేతగా అందరికి సుపరిచితులే. టికెట్ ఖరారు అయిన నాటి నుంచి జీవన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జీవన్ రెడ్డి గెలిస్తే జాతీయ రాజకీయాల్లో రైతాంగం సమస్యలు ప్రస్తావిస్తారని, కాంగ్రెస్ గెలిస్తే వ్యవసాయ మంత్రి అవుతారని ఇటీవల నిజామాబాదు సభలో రేవంత్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ నేతల సహకారంతో ప్రచారం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నిజామాబాదు అర్బన్, రూరల్ మినహా మిగతా ప్రాంతాల్లో అంతగా పరిచయం లేకపోవటం ఆ పార్టీకి కొంత లోటుగా ఉంది. దీంతో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రజల్లోకి వెళుతున్నారు. ఇటీవల కెసిఆర్ ప్రచారంతో పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వచ్చింది.

అవినీతి ఆరోపణలు లేకున్నా అరవింద్ వ్యవహారశైలిపై పార్టీలో, ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. అయితే మోడీ పాలనకు ఓటు వేయాలనే ప్రచారం అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువతలో ఈ భావన స్పష్టంగా ఉంది. అభ్యర్థితో సంబంధం లేదు దేశ రాజకీయాల నేపథ్యంలో బిజెపికి ఓటు వేస్తామని అంటున్నారు.

ఈ ప్రాంతంలో ప్రతి గ్రామం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు. బీఆర్ఎస్ హయంలో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఆచరణలో విఫలం అయింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయా వర్గాల ప్రతినిధులతో ప్రత్యెక సమావేశం నిర్వహించిన సిఎం గల్ఫ్ లో కార్మికులు చనిపోతే ఐదు లక్షల సాయం ఇస్తామని వెల్లడించారు.

బీడీ కార్మికులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ హయంలో పెన్షన్ ప్రకటించారు. బీడీ కార్మికుల ఓట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు దక్కే అవకాశం కొంత వరకు ఉంది.

రైతులు, గల్ఫ్ కార్మికుల తర్వాత ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు కీలకం. పురుషుల కన్నా మహిళా ఓట్లు లక్ష వరకు అధికంగా ఉన్నాయి. మహిళా ఓటర్లు గంపగుత్తగా మొగ్గు చూపితే పార్టీల తలరాతలు మారుతాయి.

బీఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు మున్నూరుకాపు సామాజికవర్గం కాగా కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి సామాజిక వర్గం. మున్నూరు కాపు ఓట్లు చీలితే కాంగ్రెస్ గెలుపు సులువని హస్తం నేతలు భరోసాతో ఉన్నారు. వీరి తర్వాత పద్మశాలి ఓట్లు బిజెపికి దక్కుతాయని కమలం నేతలు ధీమాగా ఉన్నారు.

2004 నుంచి ఈ నియోజకవర్గం రెడ్డి సామాజికవర్గం నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్ళింది. జీవన్ రెడ్డి గోనె కాపు కాగా మెజారిటీగా ఉన్న గూడాటి కాపులకు ఇవ్వకపోవటంతో ఆ వర్గం కొంత అసంతృప్తిగా ఉంది. నియోజకవర్గంలో గూడాటి కాపు ప్రాబల్యం అధికం. రెండు వర్గాల మధ్య వైరుద్యం ఉన్నా… పెద్దల రాయబరంతో శాంతించిన గుడాటి రెడ్లు…  ఈసారి కాంగ్రెస్ ను గెలిపించి సత్తా చాటాలని  పావులు కదుపుతున్నారని తెలిసింది.

రైతులు, గల్ఫ్ కార్మికులు, మహిళా ఓటర్లతో పాటు మైనారిటీలు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నారు. నిజామాబాదు నియోజకవర్గంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. గులాబీ దండు బలహీనమైన నేపథ్యంలో ముస్లిం ఓట్లు తమకే అని కాంగ్రెస్ ధీమాగా ఉంది.

ఈ విధంగా కాంగ్రెస్, బిజెపిల మధ్య గెలుపు దోబూచులాడుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్