ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సొంత ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ ఆ తర్వాత వోటింగ్ రేపు(మంగళవారం) నిర్వహిస్తారు. బలపరీక్ష ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా అమ్ముడు పోలేదని నిరూపించాలనేది సిఎం కేజ్రివాల్ ఆలోచనగా ఉంది. ఢిల్లీ లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కొద్ది రోజులుగా ఆప్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సిసోడియాపై సీబీఐ దాడులు జరిగిన తర్వాత ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ఆపరేషన్ లోటస్ చేపట్టిందని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. దీంతో ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగరన్న కేజ్రీవాల్ ఈ బలపరీక్షతో ఆపరేషన్ లోటస్ కాస్త ఆపరేషన్ కీచడ్ (బురద) అయిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 70. ఇందులో ఆప్‌కు చెందిన ఎమ్మెల్యేలు 63 ఉన్నారు.
దేశంలో ఇప్పటివరకు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, మధ్యప్రదేశ్, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.