Sunday, January 19, 2025
HomeTrending Newsరైతుల విషయంలో అలసత్వం వద్దు: పెద్దిరెడ్డి

రైతుల విషయంలో అలసత్వం వద్దు: పెద్దిరెడ్డి

రైతులు ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం చేసుకున్న దరఖాస్తులను ప్రాధాన్యతగా తీసుకొని సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి తొమ్మిదిగంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందించాలన్న సిఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా అధికారుల పనిచేయాలని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో  నేడు వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ రైతుల దరఖాస్తులను రోజుల తరబడి పెండింగ్ లో పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరుతామని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సీరియస్ గా తీసుకుంటామన్నారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, ఎక్కడైనా రైతుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదు వచ్చినా దానిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆక్వాజోన్ పరిధిలోని అర్హులైన రైతులకు సబ్సిడీపై విద్యుత్ ను అందిస్తోందని, దీనిపై సర్కిళ్ళవారీగా ఎంత విద్యుత్ సబ్సిడీపై అందిస్తున్నాం,  జోన్ పరిధిలో ఎంత డిమాండ్ ఉందనే దానిపై వివరాలు సమర్పించాలని సూచించారు. తద్వారా ఇంకా మెరుగైన విద్యుత్ ను అందించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి వీలుంటుందని తెలిపారు.

వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం రైతుల నుంచి ఆధార్ అప్ డేషన్, బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి  నిర్దేశించారు.  ఇంకా డిస్కంల పరిధిలో కొన్ని జిల్లాల నుంచి దీనిపై అలసత్వం కనిపిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు.  గడప గపడకు మన ప్రభుత్వం కార్యక్రమంలో క్షేత్రస్థాయిలోని విద్యుత్ అధికారులు పాల్గొని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని నిర్దేశించారు. ప్రతి సమస్యను రికార్డు చేసి, వాటిపై తీసుకున్న చర్యలను కూడా వివరించాలన్నారు. సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణంలో ఎక్కడైనా అటవీ, రెవెన్యూ విభాగాల నుంచి అనుమతులు రాకపోతే వాటిని పరిష్కరించుకునేందుకు డిస్కంల స్థాయిలో నోడల్ అధికారును నియమించుకోవాలని పెద్దిరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు.

వీడియో కాన్ఫెరెన్స్ లో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్, ట్రాన్స్ కో సిఎండి బి.శ్రీధర్, విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి, ట్రాన్స్ కో డైరెక్టర్ భాస్కర్, డిస్కం సిఎండిలు పద్మాజనార్థన్ రెడ్డి, సంతోష్ రావు, పలు జిల్లాల నుంచి విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Also Read : మీటర్లపై తప్పుడు కథనం: పెద్దిరెడ్డి ఫైర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్