Sunday, November 24, 2024
HomeTrending Newsఉత్తర భారతంలో హిమపాతం..చలి...వర్షాలు

ఉత్తర భారతంలో హిమపాతం..చలి…వర్షాలు

చలికాలం ముగిసే దశలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నది. ఒకవైపు తీవ్రమైన చలిగాలులు.. మరోవైపు వర్ష సూచనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఢిల్లీలో 12 ఏండ్ల క్రితం నాటి చలిగాలుల రికార్డు బద్దలైంది. జమ్ముకశ్మీర్‌లో ఇవాళ పెద్ద ఎత్తున మంచు కురిసే అవకాశాలుండగా.. యూపీ, ఉత్తరాఖండ్‌కు వర్ష సూచనలు ఉన్నాయి.

దేశంలోని పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రత గత 12 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అంతకుముందు 2020 జనవరిలో ఢిల్లీలో 7 రోజుల పాటు చలిగాలులు వీచాయి. కశ్మీర్‌లో ఈ రోజు (గురువారం) నుంచి మరింత ఎక్కువ మంచు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరిక జారీ చేశారు. వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జనవరి 23-24 తేదీలలో ఉత్తర భారతదేశంలో వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ చురుకుగా ఉంటుంది. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌, లడఖ్, ఉత్తరాఖండ్‌లో మంచు కురుస్తున్నది. దీని ప్రభావం రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీలలో కూడా కనిపిస్తున్నది. జనవరి 26వ తేదీ నుంచి ఉత్తర భారతదేశంలో వాతావరణం వారిపోయే అవకాశాలు ఉన్నాయి.

చలిగాలుల మధ్య రాజస్థాన్‌లో వర్షం, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నది. జనవరి 23-24 తేదీల్లో రాజస్థాన్‌తో పాటు ఉత్తర, మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చురు, ఫతేపూర్, మౌంట్ అబూలో వరుసగా ఐదో రోజు ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా నమోదైంది. యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఉష్ణోగ్రత 1.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. కాన్పూర్‌లో చలి 19 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టింది. ఇక్కడ జనవరి 22 నుంచి వానలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. వాతావరణ శాఖ 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్