Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంర్యాంకుల అంకెల రంకెలు

ర్యాంకుల అంకెల రంకెలు

Lifeless Education:
చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్ నే
చదివినవి కలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!”

పోతన భాగవతంలో ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన మాట ఇది. తెలుగు సమాజంలో బాగా ప్రాచుర్యం పొందిన మాట ఇది. అయితే ఆదర్శానికి-ఆచరణకు; భక్తికి- భావనకు ఎప్పుడూ అంతరం ఉంటుంది. ఆరేళ్లకే ప్రహ్లాదుడికి అంత క్లారిటీ ఎలా వస్తుందని ఇప్పుడు మనం తలలు బాదుకుని ప్రయోజనం లేదు. గురువులు చదివించారు. ధర్మ అర్థ ముఖ్య శాస్త్రాలన్నీ చదివాను. ఒక్క మాటలో చెప్పాలంటే చదువులో మర్మమంతా చదివాను- అన్నాడు.

ఇప్పుడయితే ఆరేళ్లకే సకల శాస్త్రాలు చదివినవాడు దేశవ్యాప్తంగా నారాయణను తలదన్నేలా ర్యాంకుల చైతన్యం నింపుతూ దేశమంతా కోచింగ్ సెంటర్లు, కోళ్లఫారం కాలేజీలు పెట్టుకునేవాడు. లేదా ప్రహ్లాదుడిని బుట్టలో వేసుకుని నారాయణలో ట్యూటర్ గానో, చైతన్యలో లెక్కల టీచర్ గానో పెట్టుకుని ఒకటి ఒకటి ఒకటి; అర అర అర; పావు పావు పావు- అన్ని ర్యాంకులు మావే-

వేలకోట్లు మాకే;
ప్రహ్లాదుడితో కోచింగ్-
వద్దన్నా ర్యాంకింగ్ -అని ప్రకటనలు ఇచ్చుకునేవారు. అయినా ఆ యుగంలో ఐ ఐ టి లేదు కాబట్టి ప్రహ్లాదుడు సకల శాస్త్రాల్లో పాస్ అయ్యాడు. ఉండి ఉంటే జె ఇ ఈ దాటి ఉ ఊలకు, అడ్వాన్సు గుమ్మం తొక్కకుండానే అడ్వాన్సుగా పక్కకు తప్పుకునేవాడు. ఒకటి మాత్రం ఆ యుగానికి- ఈ యుగానికి తేడాలేదు. కోచింగ్ ఇచ్చేవారు అప్పుడూ ఇప్పుడూ చండామార్కులవారే. మార్కులకోసం చండాలంగా హింస పెట్టేవారు, మార్కులను ప్రచండంగా రాబట్టేవారు, మార్కులు కాని అమార్కులను మార్కులుగా రాబట్టే చండ ప్రచండులు- అని వివిధ రకాలుగా చండామార్కుల మాటకు సమాసం సాధించవచ్చు. చెప్పడానికి వీలుకాని చండాలమయిన పద్ధతుల్లో మార్కులకోసమే చదువు కొనేవారు లేదా అమ్మేవారు అని వ్యుత్పత్తి చెప్పుకున్నా వ్యాకరణం పెద్దగా అభ్యంతరపెట్టకపోవచ్చు.

భారతదేశంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఏటా విద్యకు అయ్యే ఖర్చులో సున్నాలు లెక్కపెట్టడానికి ఇన్ఫినిటీ నంబర్లు కనుక్కున్న శ్రీనివాసరామానుజన్ దిగిరావాల్సిందే.

మనం చదవకూడని, చదివినా ప్రయోజనం లేని ఒక వార్త ఇది. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాబోధనకు పేరుపొందిన ఫిన్లాండ్ లో తొమ్మిదేళ్ల వయసుదాకా పిల్లలకు ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ ఏదీ చెప్పరట. ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన అన్ని మౌలికమయిన విషయాలను చెబుతారట. వినడానికే మనకు చాలా విచిత్రంగా ఉంది కదా? స్వేచ్ఛగా, హాయిగా, ఇష్టంగా పిల్లలు ఎలా చదువుతారో ఫిన్లాండ్ ఎప్పుడో పసిగట్టింది. విద్యాబోధనలో ప్రయోగాలు చేసింది. పిల్లలకు బరువు తగ్గించింది. పిల్లల ఊహా శక్తికి రెక్కలు తొడిగింది. అద్భుతాలు సాధించింది. మిగతా ప్రపంచం అందుకోలేనంత ఎత్తుకు చేరింది.

ఇదంతా ఉపోద్ఘాతం. ఇంత ఉపోద్ఘాతానికి కారణం- వరంగల్ నిట్ విద్యార్థి ఆత్మహత్య. చదువుల్లో బాగా రాణిస్తూ…ఎప్పుడూ ఏ ప్లస్ ప్లస్ మార్కులు సాధిస్తున్న ఆ విద్యార్థి జీవితంలో జీవం లేదట. “జీవం లేని జీవితం జీవించలేను” అని సూసైడ్ నోట్ రాసి…సొంత ఊళ్లో ఇంటి గదిలో ఉరేసుకుని తనువు చాలించాడు. కరోనా దెబ్బకు రెండేళ్లుగా కాలేజీ మూత పడడం, ఇంట్లో అంతులేని ఆన్ లైన్ క్లాసుల ఒత్తిడి ఈ చదువుల తల్లి బిడ్డ ఒత్తిడికి ఒక కారణంగా కనిపిస్తోది.

బాగా మార్కులు రానివారు రాలేదని, వచ్చినవారు జీవంలేని మార్కులు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటుంటే చివరికి మిగిలేదెవరు? వారు బతికి ఉండి ఆవిష్కరించాల్సిన ఎన్ని కొంగొత్త విషయాలకు దిక్కేది? మొక్కేది? వారు బతికి ఉండి మిసమిసలాడుతూ…తుళ్లుతూ…గడపాల్సిన ఘడియలు దిగులుపడుతున్నాయి. వారు పోయి ఎన్ని జీవితాలు జీవం లేనివైపోతున్నాయి?

ప్రాపంచిక విషయాలను పిల్లల పాఠ్యపుస్తకాల్లో ఫిన్లాండ్ ఎందుకు పెట్టిందో మనకెందుకు?
ఆడుతూ పాడుతూ చదువుకోవడానికి ఫిన్లాండ్ ఎందుకంత ప్రాధాన్యమిస్తోందో మనకెందుకు?
బతుకులో ఎదురయ్యే ప్రతి సందర్భానికి ఒక విశాల తాత్విక భూమిక ఉందని…బతుకు ఒక నిత్య వసంతంగా ప్రవహించే వర్ణ శోభిత పూల రుతువు అని అడుగడుగునా తెలియజెప్పే ఫిన్లాండ్ పాఠం మనకెందుకు?
జీవితమంటే బతుకు పాదులో ఆశల నీరు పోసి…ప్రతి క్షణాన్ని ఆనందమయంగా జీవించడమనే ఫిన్లాండ్ పాఠశాల విద్య మనకెందుకు?

బెల్ మోగుతోంది…
కర్ర పట్టుకుని నారాయణ చైతన్యం పిలుస్తోంది.
పదండి..పోదాం…
చదువుల చీకటి గదుల్లోకి.

పదండి…పోదాం…
ర్యాంకుల అంకెలు రంకెలేసే గొడ్ల చావిట్లోకి.

పదండి…పోదాం…
అర్థం కాని శ్మశానాల చదువుల నిఘంటువుల్లోకి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

నాడి తెలిసిన చైతన్యం- ర్యాంకు రప్పించిన నారాయణం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్