Nowgam Encounter :జమ్ము కశ్మీర్ లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. శ్రీనగర్ సమీపంలోని నౌగామ్ ప్రాంతంలో ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో కరడు గట్టిన ఉగ్రవాదులను సైన్యం మట్టికరిపించింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంలో భద్రతా బలగాలు వారున్న ప్రాంతాన్ని ఈ రోజు వేకువ జామునే చుట్టుముట్టగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. వీరంతా నిషేధిత లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులుగా పోలీసులు గుర్తించారు. ఘటనస్థలంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్ కౌంటర్ లో హతమైన ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా ఇటీవల ఓ సర్పంచ్ ను కాల్చిచంపిన ఘటనలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మార్చి 9న జమ్మూకాశ్మీర్ లోని ఖాన్మోహ్ సర్పంచ్ సమీర్ భట్ ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని లష్కర్ ఏతోయిబా అనుబంధ సంస్థ.. ది రెసిస్టన్స్ ఫ్రంట్ ప్రకటించింది. శ్రీనగర్ నగర పరిసర ప్రాంతంలోనే ఉగ్రవాదులు ఓ ప్రజాప్రతినిధిని చంపటం రక్షణ బలగాలకు సవాల్ గా మారింది. తాజాగా భద్రతా బలగాల కాల్పుల్లో ఈ ముగ్గురిని హతమార్చటంతో స్థానికులు ఉపిరి పీల్చుకున్నారు.