పదవ తరగతి పేపర్ లీకేజ్ నేపథ్యంలో నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్, NSUI నేతల అరెస్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనను గాలికి వదిలేసి రాజకీయ విధ్వంసంలో మునిగి తేలుతున్నారని రేవంత్ ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ విచారణ కొనసాగుతుండగానే పదవ తరగతి ప్రశ్నాపత్రాలు కూడా లీకేజ్ జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. అటు నిరుద్యోగులు, ఇటు విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలుపుతున్న వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం దారుణమన్నారు.
వరుసగా పదవ తరగతి పేపర్లు లీక్ అవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు. ఎస్ ఎస్ సీ బోర్డు కార్యాలయం వద్ద నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్, NSUI నేతలపై అక్రమ కేసులు బనాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అరెస్టు చేసిన NSUI, యూత్ కాంగ్రెస్ నేతలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ కు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో పరీక్షలను రద్దు చేయడం కాదని, ఇక కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నారు.
Also Read : SSC paper leak: పదో తరగతి తెలుగు పేపర్ లీక్