If it happens: తెలుగు ప్రేక్షకులు సిద్ధార్థ్ ను ఇంకా మర్చిపోలేదు. తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ .. ‘బొమ్మరిల్లు’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన కారణంగా ప్రేక్షకులు ఆయనను ఇంకా గుర్తుపెట్టుకున్నారు. ఈ సినిమాల్లో ఆయన తన పాత్రలో ఒదిగిపోయిన తీరు కూడా అందుకు మరో కారణమనే చెప్పుకోవాలి. ఆ తరువాత సిద్ధార్థ్ కి వరుస ఫ్లాపులు ఎదురు కావడం వలన, ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కొత్త హీరోల నుంచి ఎదురైన పోటీ కూడా ఇందుకు కారణమనుకోవాలి.
చాలా గ్యాప్ తరువాత తెలుగులో ఈ మధ్య ఆయన ‘మహాసముద్రం’ చేశాడు. ఈ సినిమా హిట్ అయ్యుంటే ఆయనకీ మరికొన్ని పాత్రలు వెళ్లేవేమో. కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ మధ్య కాలంలో తెలుగులో మాత్రమే కాదు, తమిళ .. హిందీ సినిమాల్లోను ఆయన జోరు తగ్గింది. ఇక ‘అవళ్’ తరువాత నిర్మాతగాను ఆయన స్పీడ్ తగ్గించాడు. ఈ నేపథ్యంలోనే హిందీలో ఆయన ‘ఎస్కేప్ లైవ్’ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ .. ” మొదటి నుంచి కూడా నేను ఏ భాషలో ఏ సినిమా చేసినా అక్కడి ప్రేక్షకులు నన్ను తమవాడిగానే ఆదరించారు. అందువల్లనే ఈ ఫీల్డులో ఇంతకాలం నిలబడిగలిగాను. సినిమా అయినా .. వెబ్ సిరీస్ అయినా నాకు నచ్చితేనే చేస్తాను. సిద్ధార్థ్ ఏంట్రా బాబు ఇలాంటి రోల్ చేశాడు అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు నచ్చే పాత్రలు .. మంచి అవకాశాలు వచ్చేవరకూ చేస్తాను .. ఆ తరువాత మానేసి ఏదో ఒక పని చూసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు. సిద్ధార్థ్ మాటలు వింటుంటే భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఆ ఆయనకి పూర్తిగా అర్థమైనట్టే అనిపిస్తోంది కదూ!