Tuesday, September 17, 2024
HomeTrending Newsభారీ సబ్సిడీతో ఆయిల్‌పామ్‌ కు రుణాలు

భారీ సబ్సిడీతో ఆయిల్‌పామ్‌ కు రుణాలు

ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నది. ఇందుకు 11 ఆయిల్‌పామ్‌ కంపెనీలకు వివిధ జిల్లాల్లో 9.46 లక్షల ఎకరాలను కేటాయించింది. ఆయా కంపెనీలు దాదాపు రూ.130 కోట్లతో నర్సరీలు ఏర్పాటుచేసుకొన్నాయి. 2022-23లో 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలన్నది లక్ష్యం. ఇందుకు 1.62 కోట్ల మొక్కలు అవసరం. ఇప్పటికే ఆయా కంపెనీల వారు కోటి మొలకలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్నారు. వీటిని నర్సరీల్లో 12 నెలల పాటు పెంచి, రైతులకు పంపిణీ చేయనున్నారు. ఆయిల్‌పామ్‌ విత్తనాలను ఇండోనేషియా, మలేషియా, కోస్టారికా వంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. చైనాతోపాటు మరికొన్ని దేశాలు కూడా ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో విత్తనాలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. రెండు,మూడేండ్ల ముందుగానే ఆర్డర్‌ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీనితో తెలంగాణ వ్యవసాయశాఖ 2022-23, 2023-24 సంవత్సరాలకుగాను ఇప్పటికే 3.25 కోట్ల విత్తనాల కోసం ఆయా దేశాలకు ఆర్డర్‌ చేసింది. దీంతో కంపెనీలకు విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి.

ఎకరాకు 49 వేల సబ్సిడీ
ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.49 వేల చొప్పున భారీ సబ్సిడీ ఇస్తున్నది. దుక్కులు, విత్తనాలు, ఎరువులు, అంతర పంటల సాగుకు ఆర్థిక సహకారం అందిస్తున్నది. మొక్కలకు రూ.11,800, బిందు సేద్యం కోసం రూ.20,317, ఎరువులు, అంతర పంటల సాగు కోసం సంవత్సరానికి రూ.4,200 చొప్పున నాలుగేండ్లకు రూ.16,800 రాయితీ ఇస్తున్నది. బ్యాంకుల ద్వారా నాలుగేండ్ల వరకు వడ్డీలేని రుణాలు ఇప్పించేందుకు కృషిచేస్తున్నది.

రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి
మార్కెట్‌ డిమాండ్‌, ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా ఆయిల్‌పామ్‌ సాగుపై ఆసక్తి చూపుతున్న రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. సాగు విస్తీర్ణం ఒక్క ఏడాదిలోనే సుమారు 30 వేల ఎకరాలు పెరగడం రైతుల ఆసక్తికి నిదర్శనం. ఇప్పటికిప్పుడు లక్ష ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయిల్‌పామ్‌ పట్ల ఆసక్తి ఉన్న కొందరు రైతులు తమ భూముల్లో ఇతర పంటలు వేయకుండా ఎదురుచూస్తున్నారు. మొక్కల కోసం ఆయిల్‌పామ్‌ కంపెనీలను సంప్రదిస్తున్నారు. ఆసక్తి గల రైతులను భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు తీసుకెళ్లి, సాగు పద్ధతులపై అక్కడి రైతులతో నేరుగా మాట్లాడించి అవగాహన కల్పిస్తున్నట్టు ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు.

సకాలంలో మొక్కలు అందిస్తాం
రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నాం. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైనన్ని మొక్కలను పెంచుతున్నాం. రైతులకు సకాలంలో మొక్కలు అందిస్తాం -రఘునందన్‌రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి

RELATED ARTICLES

Most Popular

న్యూస్