ఆయిల్ పామ్ సాగులో పారదర్శకత కొరకు యాప్, పోర్టల్ ప్రవేశపెడుతున్నట్టు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఒకే తాటిపైకి రైతులు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ఉద్యాన అధికారులు,ఆయిల్ పామ్ మరియు సూక్ష్మ సేద్య కంపెనీలు, నర్సరీ ఇంచార్జీలు వస్తారని చెప్పారు. బీఆర్కే భవన్ లో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం కోసం ఈ రోజు నూతనంగా తయారుచేసిన మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ఆవిష్కరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్, జేడీ సరోజిని, టీసీఎస్ ప్రతినిధులు రవి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి ప్రసంగం ముఖ్యాంశాలు….
పధకం అమలు చేయుటలో రైతు నమోదు కార్యక్రమం నుండి రైతు/కంపెనీ ఖాతా లో రాయితీ జమ వరకు డిజిటల్ పద్ధతిలో సులభతరంగా నిర్వహించుట యాప్, పోర్టల్ ముఖ్య ఉద్దేశం. యాప్ లో రైతుకు సంబంధించిన పేరు, గ్రామము, మండలము, అడ్రస్, ఆయిల్ పామ్ సాగు చేపట్టదలిచిన పట్టాభూమి వివరాలు,విస్తీర్ణం,అందచేయబడిన మొక్కలు, సంబంధించిన నర్సరీ, మొక్కలకు, లేత తోటల యాజమాన్యం మరియు అంతర పంటల కొరకు అందించిన రాయితీ మొదలగు అన్నీ వివరములు యాప్ లో నమోదు.
ఆయిల్ పామ్ లో 19.32 నూనె ఉత్పత్తి శాతంతో తెలంగాణ నంబర్ వన్. దేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం దాదాపు 9.25 లక్షల ఎకరాలు. దేశంలో, సాలీనా100 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పామ్ ఆయిల్ డిమాండ్ ఉండగా, వార్షిక ముడి పామ్ఆయిల్ ఉత్పత్తి ఏడాదికి 2.90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నది. ఈ లోటును దేశం దిగుమతుల ద్వారా సమకూర్చుకుంటున్నది
దేశంలో పామ్ ఆయిల్ స్వయం సమృద్ధి సాధించాలంటే అదనంగా 70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు అవసరం. తెలంగాణ రాష్ట్రానికి సుమారు 3.66 లక్షల టన్నుల పామ్ ఆయిల్ అవసరం కాగా ప్రస్తుతం 52,666టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది. అన్ని నూనె గింజల పంటలకన్నా ఆయిల్ పామ్ లో ఎక్కువ దిగుబడినిస్తుంది (ఎకరానికి 10-12 టన్నులు ), 25 – 30 సం. వరకు సంవత్సరానికి సుమారు రూ.1,20,000/- నుండి రూ.1,50,000/- వరకు, ఆదాయం పొందవచ్చు
పంటల వైవిధ్యీకరణ నేపథ్యంలో సుమారు 20.00 లక్షల ఎకరాలలో పామ్ ఆయిల్ సాగుకు ప్రభుత్వ నిర్ణయం. 27 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 11 కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్‌లను కేటాయింపు. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 38 నర్సరీలు ఏర్పాటు.
ఆయిల్ పామ్ మొక్కలు,మొదటి నాలుగు ఏళ్లకు యాజమాన్యం, అంతర పంటల సాగు మరియు సూక్ష్మ సేద్యం కొరకు, ఎకరానికి రూ.50918/- వరకు రాయితీ.