Pindi Mara: చిన్నతనంలో ఎంత కష్టమైనా రావచ్చుగాని పిండి మరకెళ్ళాల్సిన కష్టం మాత్రం ఎవ్వరికీ రాకూడదు. అంతా చదివి… మీరే అవునో, కాదో చెప్పండి…
నా బాల్యం అంతా చిన్న ఊళ్ళల్లో గడిచింది.. అప్పట్లో అన్నపూర్ణా ఆటాలు, ఆశీర్వాద్ ఆటా ఆశీర్వాదాలు మాకు దొరకని కష్టకాలమాయే..
అందరూ గోధుమలు, ధాన్యం, పప్పులు మర ఆడించుకోవల్సిందే.. ఈ పనికోసం అమ్మలు, అమ్మమ్మలు మమ్ముల్ని బాల కార్మికులుగా వినియోగించుకుని పిండిమరకు తోలేవాళ్ళు.. మాకు ఇప్పటి పిల్లలంత అవేర్‌నెస్ లేకపోవడంతో.. కార్మిక శాఖకు కంప్లైట్ చేయాలని తెలియదు..
మేము అలా పిండిమర దారిపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ రాయితీ జల్లులా మరకు పోయి వస్తే పావలానో.. పదిపైసలో ఆకర్ష్ పథకానికి ఆశ పడి.. ఈ సాహసానికి సిద్దపడితే మేము పడ్డ కష్టాలు పగోడికి కూడా వద్దు…
గోధుమలో మరొకటో నాలుగుమూడు కిలోలు క్యాన్‌లో పోసి ఆడించుకు రమ్మని చెపుతూ.. అమ్మలు మరవాడికి ఒక కేజీ తక్కువ చేసి చెప్పమని చెప్పి పంపేవారు…
మరకు పోయి.. అబద్దం చెప్పడానికి పూర్తిగా సాహసించలేక పిండిమర చక్రాలు కర్‌కర్ మని చేసే సౌండ్‌లో.. అశ్వద్దామ హతఃకుంజరః అన్నట్లుగా మూడు కేజీలని రెండనో నాలుగును మూడనో అనేసేవాళ్ళం…
పిండిమర వాళ్ళు పొద్దున్నుంచి నాలాంటి వాళ్ళను ఎంతమందిని చూసుంటారు??? బాలయ్య బాబులా కంటి చూపుతో సరుకు తూకం కనిపెట్టేసి కరెక్ట్ గా వసూలు చేసేవాళ్ళు…
ఇంట్లో మరకు పంపేముందు కణ్వమహర్షి శకుంతలకు చేసే అప్పగింతల కంటె ఎక్కువే.. మాకూ బోధ జరిగేది…
”పిండి ఆడించేప్పుడు దిక్కులు చూడకు, పిండికాజేస్తారు జాగ్రత్త” అని, మరుమ్‌గా పట్టించమనో, మెత్తగా పట్టించమనో, పసుపు తరువాత ఆడించవద్దనో, కారం తరువాత ఆడించవద్దనో.. ఆంక్షలు చెప్పి పంపేవారు…
ఇన్ని జాగ్రత్తలు చెప్పారు కదా అని మేము పిండిమరలో అడుగు పెట్టిన దగ్గరనుండి.. ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ వింగ్ వాళ్ళు డేగ కన్నుతో చూస్తున్నట్లుండే వాళ్ళం…
దీనికితోడు ప్రతి పిండి మరలో ఒక సన్న గొట్టం.. దొంగ చాటుగా అందులోనుండి కొంత పిండి మరవాళ్ళు కాజేస్తారన్న బలమైన రూమరుండేది…
పిండిమరకు చేరుకుని హై ఎలర్ట్ లో వెయిటింగ్‌లో ఉంటే..
ఈ లోపు మరవాళ్ళు మేము పిల్లలం గనుక.. పెద్దల్ని, నోరుగలవాళ్ళని ప్రయార్టీలో పెట్టేసేవారు..
ఆ రోజుల్లో కరెంట్ ఉన్న సమయం కంటే.. కరెంట్ కట్ సమయమే ఎక్కువ కావడంతో.. వెయిటింగ్ తప్పేది కాదు…
ఈ వినోదాన్ని గమనిస్తూ కొంత సేపయ్యేప్పటికి మరలో లేచిన పిండంతా.. తలమీద పడి మాకు బాలవృద్దుల గెటప్ వచ్చేసేది…
కాసేపటికి ఆ గోలలోనే ఆపరేటర్ మా చేతిలో క్యాన్ గుంజుకుని..
స్పెసిఫికేషన్స్ చెప్పేలోపే పైనున్న బకెట్ లో పోసేసి..
పిండి వచ్చే గొట్టానికి వేలాడుతున్న టార్పలిన్ గుడ్డను మడిచి..
గొట్టం మీదకు తోసి.. కర్ కర్ మని విష్టుమూర్తిలా రెండు చక్రాలు తిప్పేవాడు…
పైన బకెట్‌లో వేసిన గోధుమలు గ్రైండర్‌లో నలిగి క్రింద ఉన్న టిన్‌లో పడటానికి మూడు, నాలుగు నిముషాలు పట్టేది..
పిండి నలిగి కిందకు పడే టైమ్ కు మడచి ఉంచిన టార్పాలిన్ గొట్టాన్ని క్రింద ఉన్న డబ్బాలోకి సెట్ చేసేవాడు…
ఈ నాలుగైదు నిముషాల్లో పైన వేసినదంతా పిండిగా వస్తుందో లేదో అన్న టెన్షన్‌తో మా నరాలు చిట్లుతుండేవి…
(ఇంట్లో పెట్టిన అప్పగింతలు భయాలు సామాన్యమైనవా!) మనపిండి ఆడుతున్నంత సేపూ ఏ చక్రం తిప్పినా ఎటువెళ్ళినా మన పిండి పోతోందన్న అనుమానంతో మాకు మనశ్శాంతి ఉండేదికాదు…
కాసేపటికి డబ్బాలో పడ్డపిండిని మన క్యాన్‌లో వొంపి పొమ్మనేవాడు..
మన కళ్ళన్నీ వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌లో బాలు వైపే తిరుగుతున్నట్లు ఆపరేటర్ చుట్టూ తిరుగుతూ ఉండేవి…
ఈ అడ్వెంచర్ ముగించుకుని తల, వొళ్ళు దులుపుకుని క్యాన్ భుజానికో, సైకిల్‌కో తగిలించుకుని.. మనకు ఇవ్వబోయే పావాలాకు బడ్జెట్ ప్లానింగ్ డ్రీమ్స్ వేసుకుంటూ.. ఇల్లు చేరేవాళ్ళం…
ఇంటికి రాగానే క్యాన్ లో వచ్చిన పిండిని తూనికలు కొలతల శాఖల వలె హోమ్ శాఖవారు కొలిచేవారు…
ఇహమొదలు ”ఎటు దిక్కులు చూశావ్! ఆ చచ్చినోడు మోసం చేసి పిండి కాజేశాడు.. మేము ఎన్ని చెప్పిపంపితే ఏం ప్రయోజనం, అరకేజి తక్కువొచ్చింది…
మెత్తగా పట్టమంటే బరగ్గా పట్టాడు. నీకు ఇన్నేళ్ళొచ్చాయి. ఒక్క పనీ వివరంగా చేసుకురాలేవు” అంటూ.. కేంద్ర ప్రభుత్వం జి.ఎస్.టీ కాంపెన్సేషన్ ఎగొట్టినట్లో, తగ్గించినట్లో వారి దయాదాక్షిణ్యాలతో కొంత కోత విధించి పదిపైసలే ఇవ్వడమో.. మరీమూడ్ బాగాలేక పోతే మొత్తానికే మొండి చెయ్యి చూపేవారు…
ఇలాంటి చేదు అనుభవమైన తరువాత మళ్ళీ మరకు పోకూడదు అనుకునే వాడిని.. కాని ప్రతీసారీ కొత్త రాయితీలతో నమ్మబలికి పంపేవారు… క్లైమాక్స్ మాత్రం ఒక్కటే, ‘పిండి తక్కువ, మోసం జరిగిపోయింది. మీ వల్ల ఏమీ కాదు’…
ఆ రోజుల్లో పిండిమర స్వానుభవం అయిన సాటి కామ్రేడ్స్ అందరికీ ఒక్క విషయం అర్థమై ఉంటుంది…
యూనివర్సిటీ వీ.సీ.గా పనిచేసి విద్యార్థులతో తిట్టించుకోకుండా ఉండొచ్చేమో.. ఎమ్మేల్యేగా నియోజకవర్గ ప్రజలందరితో మంచి అనిపించుకోవచ్చేమో కానీ.. పిండిమరకెళ్ళొచ్చి మంచి పనిమంతుడనిపించుకోవడం మాత్రం దుర్లభం!
(అజ్ఞాత రచయితకు కృతజ్ఞతలతో…రచయిత ఎవరో తెలిస్తే…తరువాత అయినా ప్రస్తావిస్తాం.)
Also Read :