పాకిస్తాన్ పై అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని పాకిస్తాన్ భూభాగంలోని ప్రాంతాలు తాలిబన్లకు సురక్షిత కేంద్రాలుగా మారాయని వెల్లడించింది. ఈ విషయమై ఇస్లామాబాద్ అధికారులతో మాట్లాడుతున్నామని పేర్కొంది.
పాక్ సరిహద్దు ప్రాంతాల్లో తాలిబన్లు ఏర్పాటు చేసుకున్న అడ్డాలు ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్యుద్ధానికి, అస్థితరకు, అల్లకల్లోల పరిస్థితులకు దారితీస్తున్నాయని పెంటగాన్ మీడియా కార్యదర్శి జాన్ ఎఫ్. కేర్బీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాలను తక్షణం మూసివేయాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను పాకిస్తాన్ అధికారులకు గట్టిగా చెప్పామని వెల్లడించారు. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నా, వాటిని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఆఫ్ఘన్ దళాలకు ఉందని అయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ కు అవసరమైన ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు, అయితే పరిస్థితులు సాయం చేయాడానికి కూడా అనువుగా ఉండాల్సి ఉంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, తాలిబాన్ దళాలకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మే ఖలీల్ జాద్ మంగళవారం దోహా చేరుకున్నారు. ఆఫ్ఘన్ లో రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం ఎలా ఆందోళన చెందుతున్నదనే విషయాన్ని అయన ఇరు వర్గాలకూ వివరించనున్నారు. తాలిబన్లు వెంటనే కాల్పులు విరమించి ప్రభుత్వంతో రాజకీయ సంధికి ముందుకు రావాలని, అదొక్కటే ఆఫ్ఘన్ సుస్థిరత, అభివృద్ధికి దోహదం చేయగలదని జల్మే స్పష్టం చేశారు. తాలిబాన్ దాడుల్లో అమాయక ప్రజలు, పిల్లలు పెద్దఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది తీవ్ర గర్హనీయమని అయన ఆందోళన వ్యక్తం చేశారు.