Saturday, November 23, 2024
HomeTrending NewsPolavaram: నా ప్రశ్నలకు బదులేది?: అంబటి

Polavaram: నా ప్రశ్నలకు బదులేది?: అంబటి

పోలవరం ప్రాజెక్టును ఏటిఎంగా వాడుకోవడం కోసమే కేంద్రం కట్టాల్సిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు.  పోలవరంపై తాను అడిగిన మూడు ప్రశ్నలకు టిడిపి నేతలు గానీ, చంద్రబాబు గానీ ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదని రాంబాబు విమర్శించారు. బాబు ప్రాజెక్టుల సందర్శన అంటే  అవి ఎమైపోతాయో అని తమకు భయంగా ఉందని, ప్రాజెక్టులకు అసలు శని చంద్రబాబేనని మండిపడ్డారు. పండగ రోజు కూడా గడ్కరీని కలిశానని బాబు చెబుతున్నారని, ఆయన  చిత్తశుద్ధి అంతా ప్రాజెక్టుపై కాదని, కేవలం ముడుపులమీదేనని ఎద్దేవా చేశారు. విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో పోలవరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్  ఇచ్చారు. పోలవరం ఎత్తు  41.15 అడుగులు  అనేది మొదటి దశ అని, 45.72 అనేది రెండో దశ అని రెండు  దశలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలనేది అగ్రిమెంట్ లో ఉందని చెప్పారు.

కేంద్రప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టును ఢిల్లీ వెళ్లి జోలె పట్టుకొని అడుక్కొని తీసుకున్నారని అన్నారు. 2016లో ఈ ప్రాజెక్టును బాబు తీసుకున్నప్పుడు 2013-14 అంచనాల ప్రకారం కడతాననని ఒప్పుకున్నారని తెలిపారు. 20,398 కోట్ల రూపాయలకు అంగీకరించి, నవయుగకు 16 వేల కోట్లకు అప్పజెప్పారని వివరించారు.

జలయజ్ఞం మొదలుపెట్టిన అపర భగీరథుడు వైఎస్ అని… రాష్ట్రానికి, ప్రాజెక్టులకు పట్టిన అసలు శని బాబు అని ధ్వజమెత్తారు. అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారన్నది ఒకప్పటి మాట అని ఇప్పుడు అబద్ధమాడితే లోకేష్ లాంటి పిల్లలు పుడతారని బాబుకు చెప్పాలని మీడియాను కోరారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా బాబు తనను ఆంబోతు అంటూ సంబోధించడాన్ని అంబటి తీవ్రంగా తప్పు బట్టారు. అదృష్టవశాత్తూ ఎన్టీఆర్ అల్లుడు అయ్యాడు కాబట్టి బాబు సిఎం అయ్యారని, తన కుటుంబంలో ఎవరూ లేకపోయినా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు.  సైకిల్ గుర్తు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని,  ఆంబోతులకు ఆవులను సప్లై చేస్తే కాదా అని ప్రశ్నించారు.

దెబ్బతిన్న డయా ఫ్రమ్ వాల్ స్థానంలో సమాంతరంగా మరొకటి నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యింది కాబట్టి ఇప్పుడు డయా ఫ్రమ్ వాల్ కట్టినా ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. బాబు హయంలో డబ్బులొచ్చే పనులు ముందు మొదలు పెట్టారని అందుకే వారు పదివేలకు పైగా ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారని వెల్లడించారు.

పవన్ నటించి మొన్న విడుదలైన బ్రో సినిమాలో తనను పోలివున్న క్యారెక్టర్ పై మీడియా అడిగిన ప్రశ్నకు రాంబాబు బదులిచ్చారు. చంద్రబాబు వద్ద ప్యాకేజి తీసుకొని పవన్  డ్యాన్సులు వేస్తారని, కానీ తాను సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి రోజున డాన్స్ వేశానని, ఎవరి వద్దా డబ్బులు తీసుకాలేదని వ్యంగ్యంగా అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్