కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. 14 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా, మొత్తంగా దాదాపు 30ఏళ్ళపాటు కేబినేట్ ర్యాంకుతో కొనసాగిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోగా ఇపుడు సిఎం జగన్ అందిస్తున్న సంక్షేమ, గృహనిర్మాణం లాంటి పథకాలను చూసి ఓర్చుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పర్యటన తొలిరోజున కోల్లెపల్లి వద్ద మా పార్టీ నేతలపై దాడి చేసి, మద్దతిచ్చే ఏళ్ళలో మీడియా సహకారంతో తాము వారిపై దాడి చేసినట్లు అబద్ధాలు ప్రచారం చేశారని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. రాయలసీమకు బాబు చేసిన ద్రోహం మరే నేత కూడా చేయలేదని స్పష్టం చేశారు. బాబు మూడు రోజుల పర్యటనలో మా పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతమంది గాయపడ్డారో, టిడిపి వారు ఎంతమంది గాయాపడ్డారో చూడాలని సూచించారు. తిరుపతిలో పార్టీ నేతలతో కలిసి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ సిఎం జగన్, తనపై… పులివెందుల పిల్లి, పుంగనూరు పుడింగి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పం ప్రజలు బాబును ఎప్పుడో మర్చిపోయారని, బైటనుంచి తెచ్చుకున్న వ్యక్తులతోనే అయన గలాటా సృష్టించారన్నారు. గెలవాలంటే ప్రజల మన్ననలు పొందాలి కానీ ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు.
తనకు ఇస్తున్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను మరికొంత పెంచుకోవడానికే బాబు ఈ నాటకం ఆడి ఉంటారని పెద్దిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. రాను రాను బాబులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందన్నారు. ఆయనకు ఓ భయం పట్టుకుంది కాబట్టే… గత ముప్పై ఏళ్ళలో ఎన్నిసార్లు వచ్చారో అంతకు మించి ఈ మూడేళ్ళలో బాబు కుప్పం పర్యటనకు వచ్చారన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పూర్తి చేసిన తరువాతే ఎన్నికలకు వెళ్తామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
Also Read : ప్రభుత్వంపై ధర్మపోరాటం మొదలు: చంద్రబాబు