Monday, January 20, 2025
HomeTrending Newsధాన్యం సేకరణపై దుష్ప్రచారం తగదు: కారుమూరి

ధాన్యం సేకరణపై దుష్ప్రచారం తగదు: కారుమూరి

గత ఐదేళ్ళ టిడిపి హయాంలో 2.25 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే తాము మూడున్నరేళ్లలోనే 2.88 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించామని దీని విలువ 54 వేల కోట్ల రూపాయలు ఉందని పేర్కొన్నారు.  రైతుకు- మిల్లర్లకు, దళారీలకు సంబంధం ఉండకూడదనే ఈ-క్రాప్ విధానాన్ని తీసుకు వచ్చామన్నారు. ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే నేరుగా కల్లాల వద్దే ధాన్యాన్ని సేకరిస్తున్నామని వివరించారు. డబ్బులు కూడా నేరుగా రైతుల అకౌంట్లలోనే జమ చేస్తున్నామన్నారు. దీనిపై విపక్షాలు మొదట్లో రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేశారని కానీ ప్రభుత్వ విధానాన్ని అర్ధం చేసుకున్న రైతులు తమకు ఇదే పధ్ధతి కావాలని, దీని ద్వారా ఎకరాకు 8వేల రూపాయలు ఆదా అవుతుందని సంతోషం వ్యక్తం చేశారని మంత్రి వివరించారు. నేడు పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

కొంతమంది మిల్లర్లు అక్కడక్కడా ఇబ్బందులు కలగజేస్తున్నారని,  అలాంటి వారిపై చర్యలు కూడా తీసుకున్నామని మంత్రి చెప్పారు. మిల్లర్లు ఎవరైనా రైతులకు అన్యాయం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఇప్పటి వరకూ సేకరించిన ధాన్యానికి గాను 90 శాతం నిధులు జమ చేశామన్నారు. ప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలు తీసుకొని రైతులకు మేలు చేస్తున్నా విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. ప్రభుత్వం చేసిన మంచిని పొగడకపోయినా ఫర్వాలేదని, కానీ  దాన్ని వక్రీకరించి వార్తలు రాయడం సబబు కాదన్నారు. ఎక్కడో ఒక చోట చిన్న లోపం దొర్లితే దాన్ని భూతద్దంలో చూపి నింద మోపడం మానుకోవాలని హితవు పలికారు.

రైతులకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి మిల్లర్లు ఎవరైనా మోసం చేస్తే ఫోన్ చేయమని చెప్పామని,  విపక్షాలకు చెందిన కొందరు మిల్లర్ల వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్