మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టాయి. లోక్‌సభ, రాజ్యసభల్లోనూ ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలే మాట్లాడుతూ ఇది మహిళల సమస్య అని, ఇది రెండు రాష్ట్రాల మధ్య పోటీ కాదు అని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటన జరగకూడదని ఆమె అన్నారు.
మణిపూర్‌లో జరిగిన క్రూర ఘటన చాలా ఘోరమిందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఈ అంశంపై ప్రధాని మోదీ సభలో మాట్లాడేందుకు వెనుకాడుతున్నారన్నారు. ఈ అంశాన్ని దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అసమర్థ పాలన చేస్తోందని ఆయన విమర్శించారు.
పార్లమెంట్ బయట ప్రకటన చేయడం కాదు, ఉభయసభల్లో ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై ప్రకటన చేయాలని రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
ఇవాళ లోక్‌సభ ప్రారంభమైన తర్వాత విపక్షాలు నినాదాలు చేశాయి. మణిపూర్ అంశాన్ని చర్చించాలని పట్టుపట్టాయి. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ సమయంలో విపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నిరసనల నేపథ్యంలో ఉభయ సభలను రెండు గంటల వరకు వాయిదా వేశారు.