Saturday, November 23, 2024
HomeTrending Newsచిచ్చుపెట్టే పార్టీలు కూలిపోవాలి: సిఎం ఆకాంక్ష

చిచ్చుపెట్టే పార్టీలు కూలిపోవాలి: సిఎం ఆకాంక్ష

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు,  మీడియా సామ్రాజ్యాలు కూలిపోవాలని..దేవుని దయతో మంచి నిలబడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆళ్లగడ్డలో జరిగిన వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ యోజన కార్యక్రమం వేదికగా  వికేంద్రీకరణపై జగన్ స్పందించారు. ప్రజలందరికీ, అన్ని ప్రాంతాలకూ మంచి జరిగే పరిస్థితులు, రోజులు రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామన్న సిఎం జగన్  “మన ఖర్మ ఏంటంటే.. ఇంత గొప్ప మార్పులు రాష్ట్రంలో వస్తే.. పండ్లు కాసే చెట్టుకే రాళ్లదెబ్బలు అన్నట్టుగా.. మన రాష్ట్రంలో పరిణామాలు జరుగుతున్నాయి, ఇంతమంచి జరుగుతున్నా ఈ విషయాలు ఎల్లో మీడియాలో రావు” అంటూ వ్యాఖ్యానించారు. వారి చేతిలోనే మీడియా ఉంది కాబట్టి, వారు రాసిందే రాతలు.. ఏది చూపిస్తే అదే జరుగుతోందన్న భ్రమ కల్పిస్తున్నామన్న గర్వం వారిలో పెరిగిపోయిందని విమర్శించారు. మీడియా అన్నది న్యాయంగా, ధర్మంగా లేదని అభిప్రాయపడ్డారు. వాళ్లకు సంబంధించిన వ్యక్తి సీఎంగా లేడు కాబట్టి… ఆ వ్యక్తిని తీసుకురావడానికి కుతంత్రాలు పన్నుతున్నారని సిఎం ఆరోపించారు. ప్రజలందరూ అప్పటికీ, ఇప్పటికీ పాలనలో తేడాను గమనించాలని సిఎం  విజ్ఞప్తి చేశారు. ఆ రోజుకన్నా.. ఇవాళ బ్రతుకులు బాగున్నాయా? లేవా? అనేది ఎవరికి వారు గుండెలమీద చేతులు వేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

కేవలం రైతుల కోసం ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో రూ.1.33లక్షల కోట్లు నేరుగా ఖర్చు చేశామని, ఇప్పటిదాకా రూ.1.74లక్షల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేశామని వెల్లడించారు.  గత చంద్రబాబు పాలనతో చూస్తే దేవుడి దయతో  పంటల విస్తీర్ణం బాగా పెరిగిందనిమ్, ఆహారధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నులు అయితే, ఇవాళ అది 167.24 లక్షల టన్నులకు చేరుకుందని వివరించారు. ప్రతి గ్రామంలోకూడా రైతన్నలు సంతోషంగా ఉన్నారని, రైతు కూలీలకూ మంచి జరిగిందని ఈ లెక్కలు చెప్తున్నాయన్నారు.  ప్రతి రిజర్వాయర్‌లో కూడా పుష్కలంగా నీళ్ల ఉన్నాయని,  అనంతపురం, సత్యసాయి లాంటి జిల్లాల్లో భూ గర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయని చెప్పారు  గత ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశారు, మూడున్నరేళ్ల మన పాలన చూస్తున్నారని, తేడాను గమనించమని సిఎం జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read నేడు వైఎస్సార్ రైతు భరోసా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్