రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ విషయంపై మూకుమ్మడిగా 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రతిపక్ష పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా శుక్రవారం ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశాయి.

ప్రతిపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను బీజేపీ ఉసిగొల్పుతున్నట్టు పిటిషన్‌లో మండిపడ్డాయి. ఒకవేళ సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరితే.. ఆ తర్వాత వారిపై ఉన్న కేసులు మరుగునపడిపోతున్నట్టు ఆరోపించాయి. పీఎంఎల్‌ఏ వంటి ప్రత్యేక చట్టాల్లో కఠినంగా ఉన్న బెయిల్‌ నిబంధనలను మిగతా బెయిల్‌ షరతులతో సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేశాయి. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌ సహా 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ పీఎస్‌ నరసింహా, జస్టిస్‌ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం.. ఏప్రిల్‌ 5న విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది.

భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ, శివసేన (ఠాక్రే వర్గం), డీఎంకే, ఆర్జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, జార్ఖండ్‌ ముక్తిమోర్చా, జేడీయూ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, జమ్ముకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తదితర పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *