Tuesday, September 17, 2024
HomeTrending NewsMBBS: వైద్య విద్యపై మక్కువ ఉన్న విద్యార్థులకు తీపి కబురు

MBBS: వైద్య విద్యపై మక్కువ ఉన్న విద్యార్థులకు తీపి కబురు

తెలంగాణలో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేశారు. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం మెడికల్‌ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు 85 శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం సీట్లు అన్ రిజర్వుడుగా ఉండేవి. ఆ సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా ఎంబీబీఎస్‌ సీట్లు పొందేవారు. తాజా సవరణ వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి.

తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలను చేరువ చేయడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరింది. నాడు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి. అందులో 15 శాతం అన్ రిజర్వుడు కోటాగా 280 సీట్లను కేటాయించాల్సి వచ్చేది.

అన్‌ రిజర్వుడు కోటాలో తెలంగాణ విద్యార్థులతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సీట్లు పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. ఇదే విధానం కొనసాగితే పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15 శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దాంతో మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది. దీంతో తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభిస్తున్నాయి.
ఇప్పటికే ఎంబీబీఎస్ బి కేటగిరి సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడంవల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు పెరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలవల్ల మొత్తం 1820 సీట్లు అదనంగా ప్రతి ఏటా దక్కనున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోట 15% సీట్లు యధాతథంగా ఉంటాయి. వాటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్