Saturday, January 18, 2025

బాటసారి

సాధారణంగా, ఆధ్యాత్మిక ప్రసంగాల్లో భాష పైన మన ధ్యాస అంతగా ఉండదు. ఎంచుకున్న అంశం, చెప్పే విధానం, ప్రవచకుని శైలుల పైనే మన మనసు ఉంటుంది. వీటికి అందమైన భాష తోడైతే ఆ ఆనందమే వేరు. అందమే ఆనందం.

భావం జీవమైతే, భాష దేహం. అది అందమైన దేహమైతే మోహం మోదం రెండూ. అదే జీవద్భాష అయితే ఇక చెప్పనలవి కాదు. అంతేకదా… పరం సాధించాలన్నా, ఇహం నుండే పయనం మొదలు.

భావాన్ని నడిపిస్తూ, దాన్ని వదలక అంటి పెట్టుకుని, అంటు కట్టుకుని,  తాను నడుస్తూ, పరిగెడుతూ, తుళ్ళుతూ, పడుతూ, లేస్తూ భాష విన్యాసాలు చేయాలి. హొయలు పోవాలి. నా చెవులూరించాలి. చవులూరించాలి. నాలో ఆధ్యాత్మిక ఊట ఊరించాలి. లేత కిరణం మొలిపించాలి. అన్వేషణ అనే నిప్పు కణిక రగిలించాలి. తేటైన జ్ఞానం ప్రసరింపచేయాలి. పరాయి అనిపించకూడదు. వింటుంటే నా గురించే అనిపించాలి. మైమరపించి తనతో, తనలో…లోనికి తీసుకెళ్లి నా పొరలన్నీ ఒలిచి , నా లోని నన్ను నాకే కొత్త గా పరిచయం చేయాలి. చివరికి నా అనే భావం తొలగించాలి. పరం వైపు అడుగు వేయించాలి.

తెలుగులో మన గరికపాటి, చాగంటి, షణ్ముఖ శర్మ.. ఇంకా ఎందరో… ఒక్కొక్కరు ఒక్కో శిఖరం. ఆ శిఖరాల నుండి దూకే పావిత గంగలో  రోజూ మన మునకలే. ఆ పునః స్మరణీయుల భాష, ఆ తెలుగు తీపి గురించి నేను మళ్ళీ చెప్పాలా? విని తరించండి.

పరభాషా ప్రసంగాల్లో ఓషోది ఓ ప్రవాహం. భాష-భావం పెనవేసి సుడులు తిరిగి ఒడ్లు ఒరుసుకుని దూకుడుగా ప్రవహిస్తూ కూడా నిర్దిష్ట దిశ తప్పదు. ఆహ్లాదకరం. విన సొంపు. మనసుకి ఇంపు. ఆంగ్లమైనా, హిందీ అయినా. అతని హిందీ మరింత సొగసు. అతని లోతైన కంఠంలోని మాధుర్యం, కమ్మేసే భావ పరిమళాలకు, అతని భాష తోడై అందమైన అడవిలో అమృతవర్షంలో ఆధ్యాత్మిక వెన్నెల నదిని  ఈదినట్లుంటుంది.  ఊపిరి సలపని వేగం, భావ తీవ్రతను మోసే భాష అతని సొంతం. కట్టి పడేసే నేర్పరితనం అతని భాషకి పొంతం. ఆకాశంలోకి చేయి జాపి చిక్కినన్ని చుక్కల్ని జవిరి నీ కళ్ళ ముందు వెదజల్లి ఓ ఆధ్యాత్మిక భావావేశ, భావాతీత దృశ్యాన్ని ఆవిష్కరిస్తాడు. నిన్ను నువ్వు మరచి పయనిస్తావు. ఓషోని అనువదించడం ఓ సాహసం. భావం వ్యక్తీకరించినా, అంతే అందంగా భాషను  పూరించడం కష్టం. ఓషోని రూపించడం కష్టం. అయినా ఇష్టంగా ఇదో చిన్న ప్రయత్నం. ఒక ప్రశ్నకి సమాధానంగా సాగిన ప్రవాహం ఇది..

“అంతిమ ప్రశ్న… “నేను మహా పాపిని. రక్షించు”.
పాపంలోనూ అహంకారమే… “మహా పాపిని”. చిన్నా చితకలతో పని జరగదు. మనిషి అహంకారం అలాంటిది. మాట్లాడేది పాపం గురించి. అప్పుడు కూడా తనను తాను మహాపాపి అంటున్నాడితను. ఇంకోడు నీకంటే నేను పెద్ద పాపిని అన్నాడో … గొడవలే. “నీవెక్కడినుండి వచ్చావు ?  నా కంటే పెద్ద పాపి? అదీ నువ్వా ? నాకంటే పెద్ద పాపి ఎవ్వరూ లేరు”. మనిషికి కావాల్సింది పెద్దరికమే. డబ్బైతే అందరికంటే ధనవంతుడవ్వాలని. పదవైతే అందరికంటే పెద్దది కావాలని. పాపినైనా సరే, ఒకటైతే నిజం అందరికంటే పెద్ద పాపినే కావాలి.

నీవేమి పాపం చేశావు. ఓ హత్యా? ఓ లూటీ? మహా పాపం? ఏం మహాపాపం చేశావు? అన్నీ క్షుద్రాలే. ఒకటి గుర్తుంచుకో. అన్నిటి వెనకా అహంకారమే ఉండి తనని పోషించుకుంటుంది. త్యాగం వెనకజేరి “నేను మహా త్యాగిని” పుణ్యం వెనకజేరి “ నేను మహా పుణ్యాత్ముడను”, జ్ఞానం వెనకజేరి “ నేను మహా జ్ఞానిని” అంటుంది. చూశావా.. ఇప్పుడు పాపం వెనకజేరి అంటోంది “నేను మహాపాపిని”అని. ఇది సత్యం. అహంకారం కోరుకునేది ఒక్కటే…నేను అద్వితీయమని, నేను విశిష్టమని, నేను ప్రత్యేకమని. ఈ జడాన్ని  నరుకు. ఈ జాడ్యాన్ని పెరుకు. ఈ మొదలుని నరుకు. ఇదే అన్ని పాపాలకు మూలం. విను… ఈ “మహా” అనే పదాన్ని వదిలేయ్. ఇది పోతేనే వెలుగు.  ఈ మహా అనే భవనం కూలి ఖండమైతేనే నీలో క్రాంతి మొదలు. తెలుసుకో… మనిషి పాపం వెనక ఉండేది అహంకారమే.

బుద్ధుని కాలంలో ఓ బందిపోటు వేల మందిని చంపి  వారి వేళ్ళని నరికి మాలగా ధరించి అంగుళిమాల అయ్యాడు. అసలు పేరు తెలీదు. మహా పాపి. మహా అహంకారం. నాదిర్షా కొలువులోని  నాట్యగత్తెలు చీకటివేళ తిరిగి వెళ్లాలంటే భయపడ్డారట. వారికి వెలుగునివ్వడానికి ఓ అయిదారు ఊర్లు తగలపెట్టించాడు నాదిర్షా. మనుషులూ పశువులూ నిద్రించే పిల్లలూ తగలబడినా వెనక్కి తగ్గలేదు. అతని వెనక ఉన్నది అహంకారం. తాను చాటాలనుకున్నాడు నా కంటే మహా హంతకుడు లేడని. మహా పాపి లేడని. పాపే కానీ తృప్తి లేదు మహా పాపి అయ్యేంత వరకు. విను.. ఈ “మహా” నుండి నిన్ను రక్షించుకో. విముక్తి పొందు. సామాన్యుడిగా ఉంటే చాలు. అదే తృప్తి. సామాన్యుడే నా దృష్టిలో ధార్మికుడు.

ఇకపొతే నీ ధర్మాలన్నీ నీకు నేర్పాయి సర్వమూ పాపమని. రుచి పాపం, ప్రేమ పాపం. ప్రతీది పాపమే. ప్రతీదీ  నిందార్హమే. అందుకే జీవించలేక పోతున్నాం. నా దృష్టిలో అంతా ఆటే. ఇక్కడ పాపం పుణ్యం ఏమీ లేదు. ఇది ఒక ఆట. పుణ్యం కొంచెం మంచి ఆట. ఇతరులకి కష్టం కలిగించదు. పాపం కొంచెం చెడ్డ ఆట. ఇతరులను కష్ట పెడుతుంది. ఆటే ఆడాలంటే, పుణ్యపు ఆటే ఆడు. అయినా అదీ ఆటే. అందుకే అక్కడితో ఆగకు. పుణ్యాత్ములు పుణ్యం నుండి పాపాత్ములు పాపం నుండి బయటికి రావాలి. అప్పుడే ధర్మం మొదలౌతుంది. నీవు వెలుగు నుండీ, నీడల నుండీ బయటకు రావాలి. ద్రష్టవి కావాలి.
నేను వెలుగుని చూశాను, నీడని చూశాను. నేను రెంటికీ చెందని బాటసారిని”.

ఓషో ప్రవాహంలో ఇలాంటివెన్నో! ఎన్నెన్నో!

– విప్పగుంట రామ మనోహర.

RELATED ARTICLES

Most Popular

న్యూస్