Tuesday, April 16, 2024
HomeTrending Newsకట్టిన ఇల్లు. పెట్టిన పొయ్యే కదా.. కెసిఆర్ ఎద్దేవా

కట్టిన ఇల్లు. పెట్టిన పొయ్యే కదా.. కెసిఆర్ ఎద్దేవా

అన్నదాతకు అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పొలంబాట పట్టారు. రైతుకు బాసటగా నిలిచేందుకు, అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఆదివారం పర్యటించారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్‌తండాకు చేరుకుని.. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని పంట ఎండిపోవడంతో చేతిలో చెల్లి గవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నానని సమస్యను ఏకరువు పెట్టారు. స్పందించిన బీఆర్‌ఎస్‌ అధినేత సత్తెమ్మ కుమారుడి వివాహ ఖర్చు నిమిత్తం రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.కేసీఆర్‌ వెంట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ తదితరులు ఉన్నారు.

అక్కడ రైతులను పరామర్శించిన అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి బయల్దేరారు. తుంగతుర్తితో పాటు అర్వపల్లి, సూర్యాపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించి, మధ్యాహ్నం ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సూర్యాపేట ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.  కేసీఆర్‌ ప్రసంగం మొదలుకాగానే కరెంటు పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కరెంటు రావడంతో.. ఇట్ల కరెంటు పోతా.. వస్త ఉంటది అంటూ కెసిఆర్ సెటైర్‌ వేయగానే సభ నవ్వులతో నిండిపోయింది.

రైతుల దుస్థితి చూస్తే చాలా బాధ అనిపించిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత తొందరగా కేవలం 100 రోజులలోపే రైతులకు దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలేదన్నారు. హైదరాబాద్‌ నగరంలో కూడా ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసే దుస్థితి ఎందుకొచ్చిందని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఎండిపోయిన పంటలకు ప్రతి ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. నష్టపరిహారం ఇచ్చేదాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.

కట్టిన ఇల్లు. పెట్టిన పొయ్యే కదా? దాన్నే నడిపించే తెలివిలేకపోతే ఎలా? మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే.. రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ ప్రభుత్వ అసమర్థత, అవివేకం, తెలివితక్కువ తనం, అవగాహనా రాహిత్యం, దేన్నీ ఎట్లా వాడాలో తెలియని అర్భకత్వం మనకు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

ఇది వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డారు. పవర్‌ సిస్టమ్‌లో ఐఏఎస్‌ ఆఫీసర్లను తొలగించి టెక్నోక్రస్ట్‌ను పెట్టాం. వాళ్ల ఆధ్వర్యంలోనే నడిపాం. కాబట్టే సమర్థవంతంగా నడిచింది. వీళ్లు ఐఏఎస్‌ ఆఫీసర్లను తెచ్చిపెట్టారు. వానికి పట్టదు.. నా మంత్రులకు పట్టదు. తీరిక లేదు మంత్రులకు. రాజకీయాల కోసం తీరిక ఉన్నది కాని.. ప్రజల అవసరాల కోసం తీరిక లేదు. రైతుబంధు వేయడానికి తీరిక లేదు.

 ప్రతి పంటకు రూ.500 బోనస్‌ ఇచ్చి తీరాల్సిందేనని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. బోనస్‌ ఇచ్చే దాకా వెంటాడుతామని అన్నారు. పంట బోనస్‌ కోసం ఏప్రిల్‌ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు తనిఖీ చేశారు. సూర్యాపేట జిల్లా ఈదుల పర్రె తండాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద కేసీఆర్‌ వాహనాన్ని ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీ చేశారు. కేసీఆర్‌ వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్