ప్రపంచ మానవ చరిత్రలో… ప్రజాస్వామ్య, సమానత్వ, సామ్యవాద, సంఘ సంస్కరణల చరిత్రల్లో అత్యంత గొప్ప చారిత్రక గ్రంథం మన భారత రాజ్యాంగమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. 80 దేశాల రాజ్యంగాలను అధ్యయనం చేసిన తరువాత రూపుదిద్దుకున్న మహోన్నత రాజ్యాంగం మనదని పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రాజ్యంగ ఆవిర్భావ దినోత్సవంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సిఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం మాట్లాడుతూ రాజ్యాంగం మన ప్రభుత్వాలకు, ప్రజలకు క్రమశిక్షణ నేర్పే ఓ రూల్ బుక్ లాంటిదని, మనకు దిశానిర్దేశం చేసే గైడ్ అని, సిద్ధాంతకర్త లాంటిదని… మనదేశ సార్వభౌమాధికారానికి ప్రతీక అని కొనియాడారు.
పుస్తకం ముట్టుకోవడానికి అవకాశం లేని సమాజంలో జన్మించి, ఎవరూ చదవలేని విధంగా, ఎవరికీ లేనన్ని డిగ్రీలు సంపాదించి… ఈదేశం మారడానికి, నిలబడడానికి, ప్రపంచంతో పోటీ పడడానికి, ఎదగడానికి, ప్రగతి పథంలో పరుగెత్తడానికి కావాల్సిన ఆలోచనలు అందించిన ఘనత డా. బిఆర్ అంబేద్కర్ కు దక్కుతుందన్నారు. రాజ్యాంగం 72 ఏళ్ళుగా మన సామాజిక వర్గాల చరిత్రను తిరగ రాసింది, రాస్తూనే ఉందన్నారు. మన ఆర్ధిక, రాజకీయ, సామాజిక, విద్యా, మహిళా చరిత్రల గతిని మార్చింది, మారుస్తూనే ఉంటుందన్నారు. భావాలను, భావజాలాలను కూడా మారుస్తూ ఉందన్నారు. ఈ రాజ్యాంగమే మన సంఘ సంస్కర్త అని వ్యాఖ్యానించారు.
నిస్సహాయులకు, నిరుపేదలు, అణగారిన వర్గాలకు, అధికార దుర్వినియోగం జరిగినప్పుడు ప్రభుత్వ ఇనుప పాదాల కింద నలిగేవారి రక్షణకు దైవమిచ్చిన ఆయుధం కూడా ఈ రాజ్యంగమేనన్నారు. రాజ్యాంగంలోని మహోన్నత ఆశయాలకు ప్రతిరూపమైన, ఆకాశమంతటి ఆ మహామనీషి బాబా సాహెబ్ అంబేద్కర్ కు అంజలి ఘటిస్తున్నామని, విజయవాడ నడిబొడ్డున 2023 ఏప్రిల్ లో అయన మహా విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు వెల్లడించారు. అయన భావజాలాన్ని, రాజ్యంగ స్పూర్తిని మనసా, వాచా కర్మణా గౌరవించే ప్రభుత్వంగా మూడున్నరేళ్ళ పాలనలో ఎన్నో ముందుగులు వేశామన్నారు.