Saturday, November 23, 2024
HomeTrending Newsమతి తప్పిన మాటలవి : వెల్లంపల్లి

మతి తప్పిన మాటలవి : వెల్లంపల్లి

టిడిపి నేత అయ్యన్నపాత్రుడు గంజాయి వ్యాపారం చేసేవాడని ఆరోపణలు ఉన్నాయని, అప్పుడు కాస్త దాచిపెట్టి… ఇప్పుడు దాన్ని తనతో పాటు, టిడిపి నేతలకు ఇస్తున్నట్లు ఉన్నాడని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు ఆరోపించారు. అందుకే అయ్యన్నతో పాటు బొండా ఉమా, దేవినేని ఉమా, పట్టాభి లాంటి టిడిపి నేతలు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తూ, మతి తప్పి మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతున్నట్లు టిడిపి నేతలు ఆరోపించడాన్ని అయన తీవ్రంగా ఖండించారు. తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో వెల్లంపల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు. సిఎం జగన్ సూచనల మేరకే తాము అదుపులో ఉండి మాట్లాడుతున్నామని, లేకపోతే తాము కూడా టిడిపి నేతలకంటే ఎక్కువగా మాట్లాడతామని అన్నారు.   చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ లు ప్రవాసాంధ్రులని నెలలో ఐదురోజులు గెస్టులుగా వచ్చి గెస్ట్ హౌసుల్లో ఉండి వెళ్లిపోతారని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.

హిందూ ధర్మ ప్రచారం కోసమే టిటిడి బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమించామని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు  కాబట్టి ఆయా ప్రాంతాల నుంచి కూడా బోర్డులో చోటు కల్పించామని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవష్టానం బోర్డులో యాభైమంది ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వెల్లంపల్లి స్పందించారు. టిటిడి బోర్డులో ఆహ్వానితులను నియమించినంత మాత్రాన దేవస్థానం ఖజానాపై ఎలాంటి అదనపు ఆర్ధిక భారం ఉండబోదని, బోర్డు సమావేశాల సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో బోర్డు సభ్యులు రూములు కూడా  సొంత ఖర్చుతోనే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని, దేవాదాయ మంత్రిగా తనకు, తన భార్యకు తప్ప దర్శనానికి వచ్చే మిగిలిన అందరికీ టిక్కెట్లు కొనాల్సిందేనని తెలియజేశారు. కొన్ని సాంకేతిక కారణాలతోనే నియామక జీవోలను గౌరవ హైకోర్టు కొట్టివేసి ఉంటుందని అయన అభిప్రాయపడ్డారు.

నేటి హైకోర్టు తీర్పుపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది సిఎం జగన్ మోహన్ రెడ్డి, న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని వెల్లంపల్లి వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్