We are the best: మహిళలకు రాజకీయ సాధికారత కల్పించడంలో తమ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలంటూ 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారని… కానీ అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 మహిళలు ఇచ్చేలా ఏకంగా చట్టం చేశామని గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియమ్‌లో ‘మహిళా సాధికారత–జగనన్న లక్ష్యం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సిఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… నామినేటెడ్ పదవుల్లో 51 శాతం పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం తమదేనని, మొత్తం 1,154 డైరెక్టర్ పదవుల్లో అక్కచెల్లెమ్మలకు 586 పదవులిచ్చామని గర్వంగా చెప్పగలుతామన్నారు, 202 మార్కెట్‌యార్డు ఛైర్మన్ పదవుల్లో 102 మహిళలకే ఇచ్చాం. అంటే మొత్తంగా 1356 రాజకీయ నియామక పదవుల్లో 688, అంటే అక్షరాలా 51 శాతం అక్కచెల్లెమ్మలకు కేటాయించామన్నారు. “నేను ఒక స్త్రీని కాబట్టి, నన్ను ఎవరు ఎదగనిస్తారన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారన్నది ప్రశ్న’.. అంటూ ఓ మహిళా చెప్పిన మాటలకు అర్ధం ఈ రోజు ఇక్కడ కనిపిస్తోందన్నారు.
13 జడ్పీ ఛైర్మన్ల పదవుల్లో 7, 26 జడ్పీ వైస్‌ఛైర్మన్ పదవుల్లో 15, 12 మేయర్, 24 డిప్యూటీ మేయర్… మొత్తంగా 36 పదవుల్లో.. 18 మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారని వివరించారు. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు మెంబర్లు 671 అయితే, వారిలో అక్కచెల్లెమ్మలకు 54 శాతం అంటే, 361 పదవులు దక్కాయని, ఇటీవల 75 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే వాటిలో 73 చోట్ల వైయస్సార్‌సీపీ విజయం సాధించిందని, వాటిలో అక్షరాలా 45 మంది, అంటే 64 శాతం నా అక్కచెల్లెమ్మలే ఛైర్‌పర్సన్లుగా ఉన్నారని వివరించారు. 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది, అంటే 55 శాతం అక్కచెల్లెమ్మలకే దక్కేట్లు చేశామని గర్వంగా చెబుతున్నామన్నారు. సర్పంచ్ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండల అధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీల్లో 53 శాతం నా అక్కచెల్లెమ్మలకే దక్కేలా చేయగలిగామన్నారు.
సచివాలయాలు–వలంటీర్లలో మహిళలు అవకాశం కల్పించామని, అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ సున్నా వడ్డీ, వైయస్సార్ చేయూత, వైయస్సార్ పెన్షన్ కానుక, ఇళ్లు–ఇళ్ల స్థలాలు–ఆస్తి, విద్యాదీవెన, వసతి దీవెన, వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలు అమలు చేస్తున్నామని సిఎం వెల్లడించారు. దిశా యాప్ పై కూడా సిఎం ప్రస్తావించారు. ఈ 34 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలకు నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రూ.83,509 కోట్లు అందించామన్నారు.
మహిళాభ్యుదయానికి కట్టుబడి అడుగులు ముందుకు వేస్తున్న తమ ప్రభుత్వానికి దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు అందించి ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కేక్ కట్ చేసిన ముఖ్యమంత్రి ప్రజా ప్రనిధులకు స్వయంగా తినిపించారు.
Also Read : ఇంతేనా మహిళా దినోత్సవమంటే?