Outsiders Must leave Badvel Bjp Leaders Appeal To District Officers :
ప్రచారం గడువు ముగిసినా మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు బద్వేల్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారని, వారిని తక్షణమే బైటికి పంపాలని బిజెపి నేతలు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేతృత్వంలో నేతలు జిల్లా కలెక్టర్ ను కలుసుకుని వినతి పత్రం సమర్పించారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 27న సాయంత్రం ఏడు గంటల తరువాత బైటి వ్యక్తులు నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళాల్సి ఉందని, కానీ ఆ గడువు ముగిసి 24 గంటలవుతున్నా వారు ఇంకా అక్కడే బస చేశారని బిజెపి నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దాదాపు 50 మంది వరకు బద్వేలు అసెంబ్లీ పరిధిలోనే ఉన్నారని పేర్కొన్నారు. వీరు కాకుండా వందలాది వైసీపీ కార్యకర్తలు ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడే మకాం వేశారని వారందరినీ తక్షణమే గుర్తించి, బైటికి పంపడంతోపాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
బద్వేల్ అసెంబ్లీ పరిధిలోని వాలంటీర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, నరేగా ఉద్యోగులను ఎన్నికల రోజు సంబంధిత మండల కార్యాలయాల్లో ఉంచి చివరి గంటలో ఓటింగ్ కు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బిజెపికి మద్దతు తెలిపే వ్యక్తులపై ఇప్పటికీ పోలీసులు బైండోవర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని, బిజెపి కార్యకర్తలను వేధిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి. ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
Must read : తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు: మంత్రి సురేష్