Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవడ్లగింజలో బియ్యపుగింజ రాజకీయం

వడ్లగింజలో బియ్యపుగింజ రాజకీయం

Paddy Purchase in Telangana: State or Central?

తెలంగాణాలో ఒక్కసారిగా ట్రాక్టర్ల అమ్మకాలు పెరిగాయి. ఏ ఫార్మ్ హౌస్ దగ్గర చూసినా ట్రాక్టర్లే. నాగళ్లే. అయితే దున్నేవారు మాత్రం వ్యవసాయ కూలీలు కాదు. వ్యవసాయ కూలీల పొట్టగొట్టి రాజకీయ నాయకులు పొలాల బాట పడుతున్నారు.

ఆ విధంగా నాగళ్లు కట్టుకున్న ట్రాక్టర్లు దున్నడానికి బయలుదేరాయి. ఈలోపు నాలుకలు చీరేయడానికి కత్తులు తమను తామే నూరుకుంటున్నాయి. నాగలి ఉన్నది నేల దున్నడానికే. ట్రాక్టరుకయినా వెనక నాగలే ఉంటుంది. కత్తి ఉన్నది కోయడానికే.

సందట్లో సడేమియాలా ఎందుకోగానీ కొన్ని ముక్కులు నేలకు రాసుకుంటున్నాయి. కొన్ని తలలు పగలగొట్టుకోవడానికి పోటీలు పడుతున్నాయి. టచ్ చేసి చూడమని గులాబీ ఛాలెంజ్ విసిరితే…ట్రయలరే అయ్యింది … మున్ముందు సినిమా చాలా ఉందని తామర హెచ్చరిస్తోంది.

గుండెల్లో ఉప ఎన్నిక ఈటెలు గుచ్చుకున్నాయి. మధ్యలో బియ్యానికి నూకలు చెల్లిపోయాయి. కయ్యాల్లో వడ్లు గట్లు దాటి మూటల్లోకి వస్తే…మాటల కయ్యాల మధ్య బియ్యానికి భిక్షం దొరకడం లేదు. ఉప్పుడు బియ్యం చప్పుడే చేయకూడదట. చెప్పుడు బియ్యం చెవిటిదయ్యింది. వద్దన్న వడ్లు మొలకెత్తి, వెన్ను వేసి, గింజ రాలి గింజుకుంటున్నాయి.

బియ్యం కొంటారా? కొనరా? అన్నదే వడ్ల ప్రశ్న. కేంద్రం కొంటుందా? కొనదా? అన్నదే రాష్ట్రం ప్రశ్న. రాష్ట్రం కొంటుందా? కొనదా? అన్నదే కేంద్రం ప్రశ్న. ఎవరూ కొనరు అన్నది ఎవరూ చెప్పని సమాధానం. ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకోవడానికి పేరుకుపోతున్న వడ్ల మూటలు పనికి వస్తున్నాయి.

అ క్షతం…దెబ్బ తిననిది అక్షింతలు. ఇప్పుడు అక్షింతలకు అక్షరాలా అక్షింతలు పడుతున్నాయి. అక్షతల గుండె ముక్కలై క్షతమైపోతున్నాయి. పిడుగుకు బియ్యానికి ఒకే మంత్రం చదివే రాజకీయంలో బియ్యం తన నోట్లో తానే బియ్యం వేసుకుని పాడె మీద పడుకుంటోంది. తన పిండం తానే మూడు ముద్దలుగా పెట్టుకుని కాకులకోసం ఎదురు చూస్తోంది.

అన్నం వడ్లకు అధ్వాన్నమై రోడ్లమీద దిక్కులు చూస్తోంది. ఉడకని బియ్యం దీక్షలు, ధర్నాలకు పనికొస్తోంది. ఎవరి వల్ల? ఎవరి చేత? ఎవరి కొరకు? ఎవరిది పైచేయి? ఎవరిది మొండి చేయి? ఎవరిది కుట్ర? ఎవరిది చేతగానితనం? అన్ని ప్రశ్నల్లో ‘వరి’ కామన్. కానీ సమాధానం ఎవరూ చెప్పలేని వరీ- బాధ.

మూటల్లో బియ్యం మూటల్లోనే ఉంది. మాటలు మాత్రం అరుణాచల్లో చైనా కట్టిన గ్రామాలు దాటాయి. విలేఖరుల ప్రశ్నలకు జ్ఞానం కట్టలు తెంచుకుని మీద పడుతోంది. విలేఖరుల నెత్తిన ఏలినవారి అక్షింతలు పడుతున్నాయి. తలంబ్రాలు తలదించుకుంటున్నాయి.

అక్షరాభ్యాసం పళ్లెంలో బియ్యం మీద రాసుకున్న “ఓం నమః శివాయ” అక్షరాలు అర్థం వెతుక్కుంటూ దిక్కులు చూస్తున్నాయి.

ఇప్పుడు బియ్యం ఒక అజ్ఞానం.
ఇప్పుడు బియ్యం ఒక అయోమయం.
ఇప్పుడు బియ్యం ఒక అసందర్భ సందర్భం.
ఇప్పుడు బియ్యం ఒక కయ్యం.
ఇప్పుడు బియ్యం ఒక అంటరానిది.
ఇప్పుడు బియ్యం ఒక ఉద్యమం.
ఇప్పుడు బియ్యం వడ్లగింజలో దాగిన ఒక రాజకీయ విజ్ఞానం.

-పమిడికాల్వ మధుసూదన్

Read Also:

ఒరుగుతున్న వరి వెన్ను

Read Also:

హుజురాబాద్ చెప్పే పాఠం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్