Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆమె ఒక తులసి వనం

ఆమె ఒక తులసి వనం

Padma Shri Awardee Tulsi Gowda: The Encyclopedia Of Forest

బిడ్డ కడుపులో పడ్డప్పటినుంచీ తల్లికి అనుబంధం మొదలవుతుంది. అన్నాళ్లూ ఎలా తిన్నా కడుపులో బిడ్డ ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకుంటుంది. బిడ్డ పుట్టాక వారి ఆరోగ్యం కోసం తపిస్తుంది. ఆటపాటలు చూసి మురుస్తుంది. వారు ఎదుగుతుంటే తరిస్తుంది. తనను పట్టించుకోకపోయినా భరిస్తుంది. చల్లగా ఉండమని దీవిస్తుంది.

తులసి బిడ్డలు ఒకరూ ఇద్దరు కాదు. వేలు, లక్షల్లో ఉన్నారు. ఆమెతోనే ఉన్నారు. పచ్చగా విస్తరించిన తన పిల్లల సామ్రాజ్యంలో తులసి మహారాణి. అందుకే ‘పద్మశ్రీ’ ఆమెకు మకుటాయమానమైంది.

ఈ సారి పద్మ అవార్డులు కొన్ని ఆసక్తి కరం. అందులో తులశమ్మ ప్రత్యేకం.కర్ణాటకకు చెందిన ఈ మహిళ చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుని తల్లితో పాటు కూలి పనులకు వెళ్ళేది. బాల్యం వీడకుండానే వివాహమైంది. కొన్నాళ్ళకు భర్తని పోగొట్టుకుని చెట్టు పుట్టతో గోడు చెప్పుకునేది. అలా ఆమెకు మొక్కలతో అనుబంధం పెరిగింది. వాటి సంరక్షణలో తులసికి మనశ్శాంతి దొరికింది. విత్తనాలు సేకరించడం, నాటడం. అలా సుమారు లక్ష మొక్కలు నాటింది.

అరుదైన విత్తనాలు సేకరించింది. వాటిలో వైద్యానికి పనికొచ్చే మొక్కలు అనేకం. అందుకే తులసికి మొక్కలపై ఉన్న పట్టు గమనించి ఉద్యానశాఖలో నియమించారు. 70 ఏళ్ళు వచ్చేవరకు పనిచేసి రిటైర్ అయినా మొక్కలతో అనుబంధం వదల్లేదు. ఇప్పటికీ ఎందరో వృక్ష శాస్త్రజ్ఞులు, విద్యార్థులు తులసిని సంప్రదిస్తూనే ఉన్నారు. తను నాటిన మొక్కలపై ఎటువంటి వివరాలైనా అవలీలగా చెప్పగలదీమె. అందరూ ప్రేమగా ఎన్సైక్లోపీడియా అఫ్ ఫారెస్ట్ అని పిలుచుకుంటారు. ఎన్నో అవార్డులు వరించాయీ వృక్ష ప్రేమిని.

తాజాగా పద్మశ్రీ అవార్డు అందుకోడానికి అత్యంత నిరాడంబరంగా కదిలొచ్చిన తులసి తల్లి ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తమ మూలాలను మర్చిపోని ఇటువంటి తల్లులే మన వనాలకు శ్రీరామ రక్ష !

-కె. శోభ

Also Read:

పూలు గుసగుసలాడేనని…

Also Read:

పెద్దోళ్ల సినిమా కష్టాలు

Also Read:

ఆర్గానిక్ సాగు శ్రీలంక కొంప ముంచిందా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్