Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణ రాష్ట్రానికి పేజ్ ఇండస్ట్రీస్

తెలంగాణ రాష్ట్రానికి పేజ్ ఇండస్ట్రీస్

అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జాకీ ఇంటర్నేషనల్ కంపెనీ దుస్తులను తయారుచేసే పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు 290 కోట్ల రూపాయలతో తెలంగాణలో తయారీ యూనిట్లు పెడుతున్నట్టు ప్రకటించింది. పేజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వీ. గణేశ్, ఆ సంస్థ సీనియర్ ప్రతినిధి బృందం ఇవాళ ప్రగతి భవన్ లో మంత్రి కే తారక రామారావు తో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికలను వివరించింది.
ఇబ్రహీంపట్నంలోని వైట్ గోల్డ్ స్పిన్ టెక్ పార్క్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీలో సుమారు లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో పేజ్ ఇండస్ట్రీస్ తయారీ యూనిట్ ను ఏర్పాటుచేస్తుంది. ఈ యూనిట్ ఏర్పాటుతో 3000 మంది స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఇబ్రహీంపట్నంతో పాటు సిద్దిపేట జిల్లా ములుగులో 25 ఎకరాల విస్తీర్ణంలో భారీ తయారీ యూనిట్ ను కూడా పేజ్ ఇండస్ట్రీస్ నిర్మిస్తుంది. తద్వారా మరో 4000 మంది స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు దక్కుతాయి.


పేజ్ ఇండస్ట్రీస్ ఇప్పటికే ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఒమన్, ఖతార్, మాల్దీవ్స్ ,భూటాన్, యూఏఈ దేశాలలో జాకీ ఉత్పత్తులను అమ్ముతూ ప్రముఖ గార్మెంట్స్ తయారీ సంస్థగా ఎదిగిందనీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వీ. గణేశ్ తెలిపారు. భారత ఉపఖండంతో పాటు ఇతర దేశాల్లో ప్రసిద్ధి చెందిన తమ కంపెనీ ఉత్పత్తుల తయారీ కోసం తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకున్నామన్నారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. భారతదేశంలో మరింత పెద్ద ఎత్తున వ్యాపారాన్ని విస్తరించేందుకు భౌగోళికంగా అత్యంత అనుకూలమైన ప్రాంతంగా తెలంగాణ ఉందన్నారు. తెలంగాణ నుంచి తయారయ్యే జాకీ ఉత్పత్తులతో పాటు తమకు లైసెన్స్ ఉన్న స్పీడో బ్రాండ్ ఉత్పత్తులను భారతదేశంతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని గణేశ్ తెలిపారు. తమ పెట్టుబడి ప్రణాళికల కోసం ప్రతి అడుగులో తెలంగాణ ప్రభుత్వం సహకరించిందని అందుకు ధన్యవాదాలు అన్నారు.
జాకీ ఉత్పత్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతినిధి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కంపెనీ మరింతగా అభివృధ్ధి చెందుతున్న ఆశాభావాన్ని కేటీఆర్ ఆశించారు. పేజ్ ఇండస్ట్రీస్ పెడుతున్న 290 కోట్ల రూపాయల పెట్టుబడితో సుమారు 7000 మంది స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్