పొరుగు దేశం పాకిస్థాన్ గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి లేక, ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారు. దీనికి తోడు ధరల పెరుగుదల ఆ దేశ ప్రజలకు శాపంగా మారుతోంది. విద్యుత్ చార్జీల భారంతో ఇప్పటికే అల్లాడుతున్న పాక్ ప్రజలను ఇప్పుడు ఇంధన ధరలు కూడా పట్టి పీడిస్తున్నాయి. పాక్ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 మార్కును దాటాయి.
ప్రధాని అన్వరుల్ హక్ కకర్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్ ధర లీటరుకు రూ.14.91, డీజిల్ (హై-స్పీడ్) ధర రూ.18.44 మేర పెంచింది. దీంతో, లీటరు పెట్రోల్ ధర రూ.305.36కు చేరుకోగా, డీజిల్ ధర రూ.311.84ను తాకింది.
ఇప్పటికే విద్యుత్ బిల్లుల పెంపుపై దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రజలు తమ విద్యుత్ బిల్లులను తగలబెట్టారు. డిస్కమ్ సంస్థల అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు పాక్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు.
ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవలే ఆర్థిక సంస్కరణలతో పాకిస్థాన్ ద్రవ్యోల్బణం ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరింది. ఫలితంగా పాకిస్థానీ రూపాయి కూడా క్రమంగా దిగజారిపోతోంది. దీంతో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను భారీగా పెంచాల్సి వచ్చింది. గత మంగళవారం నాటి ముగింపు 304.4తో పోలిస్తే, దేశ కరెన్సీ డాలరు మారకంలో 305.6 వద్ద ట్రేడవుతోంది.