తాలిబాన్ ఉగ్రవాదుల వ్యవహారంలో పాకిస్తాన్ వైఖరి బయట పడింది. పాక్ – తాలిబాన్ సంబంధాలపై అంతర్జాతీయ సమాజం చేస్తున్న ఆరోపణలు నిజమేనని రుజువైంది. పాకిస్తాన్ తాలిబాన్ ల స్వర్గాధమమేనని మరోసారి ద్రువీకరణ అయింది.ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
తాలిబాన్ ల కుటుంబాలు పాకిస్తాన్ లో ఉంటాయని పాక్ అంతరంగిక శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ లో ఒప్పుకున్నారు. ఇస్లామాబాద్ తో సహా వివిధ నగరాల్లో వారి కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. ఆఫ్ఘన్ తాలిబాన్ లు వైద్యం కోసం పాకిస్తాన్ లోని ఆస్పత్రులకు వస్తారని మంత్రి వెల్లడించారు. రావట్, లోయి బేర్, బర కహుహ్ తదితర ఇస్లామాబాద్ శివారు ప్రాంతాల్లో తాలిబాన్ కుటుంబాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఆఫ్ఘన్లో చనిపోయిన తాలిబాన్ ల శవాలు ఖననం కోసం ఇక్కడ ఉండే వారి కుటుంబ సభ్యుల వద్దకే తీసుకొస్తారని చెప్పారు.
మరోవైపు పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి తాలిబాన్ ల జాడ పాకిస్తాన్ లో లేదని ఈ నెల మొదటి వారంలో ప్రకటించారు. తాలిబాన్ నాయకులు ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటారని, పాక్ లో వారి కదలికలు లేక దశాబ్దాలు అవుతోందన్న ఖురేషి ఉగ్ర మూకలు ఎప్పుడో అంతమయ్యాయని తేల్చి చెప్పారు. తాలిబాన్ లకు పాకిస్తాన్ నిధులు సమకూరుస్తోందని ఏళ్ళ తరబడి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖురేషి విమర్శించారు. ఆఫ్ఘన్ లో శాంతి, సుస్థిరత లకే పాక్ ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.
ఆర్థికంగా కుదేలైన పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకు ప్రాపకం కోసం ఆపసోపాలు పడుతోంది. ఉగ్రవాదుల కదలికలు, వారి సానుభూతిపరులు తమ దేశంలో లేరని అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఊదరగొట్టడం ఉత్తదేనని తాజాగా తేలిపోయింది.