Parag Agarwal :
మరో ప్రపంచస్థాయి టెక్ సంస్థలో ఉన్నత స్థాయి పదవిని భారత సంతతి వ్యక్తి అధిరోహించారు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్(Twitter)కు భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమితుడయ్యారు. ఈ మేరకు పరాగ్ నియామకంపై ట్విట్టర్ ప్రకటన చేసింది. 2011లో పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ లో చేరారు. ఆ తర్వాత 2017లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా నియమితులయ్యారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ 16 సంవత్సరాల తర్వాత పదవి నుంచి తప్పుకోవడంతో ప్రతిష్ఠాత్మక హోదా 37 ఏళ్ల అగర్వాల్ కు దక్కింది. ప్రపంచంలోని ప్రముఖ 500 కంపెనీల్లో అతి చిన్నవయస్కుడైన సీఈవోగా అగర్వాల్ రికార్డు దక్కించుకున్నారు.
గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, ఐబీఎంకు అరవింద్ కృష్ణన్, మైక్రోసాఫ్ట్ బాస్ గా సత్యనాదెళ్ల ఉండగా.. ఇప్పుడు ట్విట్టర్‌కు అధిపతిగా మారి పరాగ్ అగర్వాల్ వారి సరసన చేరి అమెరికాలోని భారీ టెక్నాలజీ కంపెనీకి సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. పరాగ్ అగర్వాల్ ముంబై ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. పరాగ్ నియామకంపై ట్విట్టర్ వివరణ ఇస్తూ పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీటీవోగా సంస్థ టెక్నాలజీ స్ట్రాటజీ, కంపెనీ మెరుగుదలకు మెషిన్ లెర్నింగ్ వినియోగించే ప్రక్రియను ముందుండి నడిపించారు. కంజ్యూమర్ ఇంజినీరింగ్, రెవెన్యూ పెరుగుదలతో పాటు 2016, 2017 సంవత్సరాల్లో ట్విట్టర్‌కు ప్రజాదరణ గణనీయంగా పెరగడంలో పరాగ్ పాత్ర చాలా ఉందని ట్విట్టర్ పేర్కొంది.