Friday, October 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇంట్రావర్ట్ - లోపలి మనిషి - అంతర్ముఖుడు

ఇంట్రావర్ట్ – లోపలి మనిషి – అంతర్ముఖుడు

Need to Motivate: కొంతమంది నలుగురితో కలవడానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతారు. ముభావంగా వుంటారు. మనసులోని మాటను- అది కోపమైనా, దుఃఖమయినా తమలో తామే దిగమింగుకొంటారు . నలుగురితో కలవాల్సి వచ్చినప్పుడు కష్టంగా  కాలంగడుపుతారు. వారి నుంచి ఎప్పుడు దూరం జరుగుతానా అని ఎదురు చూస్తారు. నలుగురితో కలిసినప్పుడు అలసి పోతారు. ఇలాంటివారే అంతర్ముఖులు.

తమాషాగా చెప్పాలంటే ‘రేసుగుర్రం’ సినిమాలో ప్రకాష్ రాజ్ ఆయన కూతురు శృతి హాసన్ లాగా!

సైకాలజీ పుస్తకాల్లో ఇంట్రావర్ట్ , ఎక్సట్రావెర్ట్ అనేది జన్యు పరమైన అంశాలని, ఇంట్రావర్ట్ ల మెదడు నిర్మాణం భిన్నంగా ఉంటుందని , ఇంట్రావర్ట్ ను ఎక్సట్రావెర్ట్ గా మార్చలేమని ఉంటుంది.

ఇందులో కొంత నిజముంది. కానీ … పిల్లలని పెంచి పెద్ద చేసిన వాతావరణం, వారి బాల్యపు అనుభవాలు ప్రధానంగా వారు ఇంట్రావర్ట్ లు అవుతారా? లేక ఎక్సట్రావెర్ట్ లా? అనేదాన్ని నిర్ణయిస్తాయి.

“మీ పాఠశాలలో చేరే వరకు మా అమ్మాయి / అబ్బాయి ఇంట్రావర్ట్ .. కానీ ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది” అని ఎంతో మంది తల్లితండ్రులు ఎన్నో సందర్భాల్లో చెప్పారు.

1. పిల్లల్ని పెద్దగా ఎవరితో కలవకుండా పెంచడం.
2. వారు చేసిన తప్పులను అవతలి వారు విమర్శించడం / హేళన చేయడం / కించపరచడం…

లాంటివి బాల్యంలో జరిగినప్పుడు పిల్లల్లో ఇంట్రావర్ట్ ప్రవర్తన మొదలెడతారు .

1 . పిల్లల్ని నలుగురితో కలవనివ్వాలి.
2 . అవతలి వారు మనల్ని తప్పుపట్టినప్పుడు, మనలో లోపం ఉంటే దాన్ని సరి దిద్దుకొంటే మనకే మేలు కలుగుతుంది– అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
౩. విమర్శ ఎదురయినప్పుడు ఆత్మ శోధన చేసుకోవాలి. మనలో తప్పులేదని తేలినప్పుడు, అవతలి వారు ఈర్ష / అసూయ / ద్వేషం / శాడిజం లాంటి కారణాలతో మనల్ని విమర్శించడం / హేళన చేయడం లాంటివి చేస్తున్నారని స్పష్టంగా తేలినప్పుడు, వారిని పట్టించుకోవద్దు. లైట్ గా తీసుకోవాలి. మనం పట్టించుకొంటే దుర్బుద్ధి కలిగిన అవతలి వారికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. పట్టించుకోకుంటే వారే కొంతకాలానికి మానేస్తారు. ఈలోగా వారి టైం వేస్ట్. అంతే! ఇలాంటి దృఢ చిత్తం, ఆత్మవిశ్వాసం పిలల్లకు ఇవ్వాలి. “ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అనే టైప్ లో వారిని పెంచాలి .
4 . పాఠ్య పుస్తకాల్లో ఉన్న అంశాలను గ్రహించడం అకాడమిక్ ఇంటలిజెన్స్ ను పెంచుకోవడం ముఖ్యం. అదే విధంగా సోషల్ ఇంటలిజెన్స్ కూడా ముఖ్యం. పాఠశాల, ఇల్లు, బంధువుల- స్నేహితుల ఇళ్ళు.. మొత్తం సమాజం పిల్లలకు సామాజిక తెలివి తేటలు నేర్పే ప్రాంతాలు. ప్రతి విషయం గురించి తల్లితండ్రి / టీచర్ లు పిల్లలతో డిస్కస్ చెయ్యాలి.
5 . మంచి కథలు చదవడం, పాత సినిమాలు చూడడం ద్వారా కూడా సామాజిక తెలివితేటలు అలవర్చుకోవచ్చు. మహాభారతంలో దృతరాష్ట్రుడు, కర్ణుడు, విదురుడు, దుర్యోధనుడు .. ఒకటా? రెండా ? ఎన్ని క్యారెక్టర్ లు!!

గయ్యాళి అత్త సూర్య కాంతం, మంచితనం సరే.. మోసాన్ని గుర్తించలేని బలహీనత పెద్దాయన గుమ్మడి  గుండెలో ప్రేమ- మాట కటువు బామ్మ/ అమ్మమ్మ – నిర్మలమ్మ, మనసు వెన్న పెదనాన్న రంగ రావు ….. . వామ్మో .. నిజ జీవిత డిక్షనరీ పాత్రలు.. ఒకటా… రెండా ? పదుల- వందల సంఖ్యలో.
తాత మనమడు సినిమా, హృదయంలో ముద్రపడిన పసివాడు పెద్దయ్యాక తల్లితండ్రిని దూరం పెట్టగలడా?
‘పండంటి కాపురం’ చూసి ప్రభావితం అయినవారు, కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఉమ్మడి కుటుంబం లాగ పండగ రోజు కలుద్దాము అనుకోరా?
‘బొమ్మరిల్లు’ నాన్నను చూసి కొంతమంది నాన్నలు కూసింతయినా మారారా ?

చివరిగా ఒక మాట .
అన్నం / పప్పు ఉడికించడానికి ప్రెషర్ కుక్కర్ ను స్టవ్ పై పెట్టాక, కాసేపటికి అది బుస్స్ బుస్ అని శబ్దం చేస్తుంది. దానిపై ఒక సేఫ్టీ వాల్వ్ ఉంటుంది. లోపలి అధిక ఆవిరిని బయటకు పంపేస్తుంది. సేఫ్టీ వాల్వ్ లేకపోతే? పీడనం ఎక్కువై ఢాం అని పేలిపోదా?

మనిషీ అంతే .. కోపాన్ని కష్టాన్ని నలుగురితో పంచుకోవాలి .
లేకుంటే? ..
అంతర్ముఖుడిగా ఉండిపొతే… బాగా కష్టం ఎదురయినప్పుడు మనసులోనే బాధ పడుతూ ఆత్మహత్య వైపు వెళ్లొచ్చు. ఆత్మ హత్యలకు అనేక కారణాలు ఉన్నా.. ఇలాంటి అఘాయిత్యాలకు పూనుకొనే వారిలో ఎక్కువ మంది అంతర్ముఖులే !

-వాసిరెడ్డి అమరనాథ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్