పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఉద‌యం 11 గంట‌లకు ఉభ‌య స‌భ‌లు స్టార్ట్ అయ్యాయి. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లోనూ కొత్తగా ఎన్నికైన స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. సిమ్రన్‌జీత్ సింగ్ మాన్ (సంగ్రూర్), ఘన్‌శ్యామ్ సింగ్ లోధి (రాంపూర్), దినేశ్ లాల్ యాదవ్ (ఆజాంగఢ్), శతృఘన్ ప్రసాద్ సిన్హా (అసన్‌సోల్) ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, అబుదాబీ అధినేత షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ సహా పలువురు మాజీ ఎంపీల మృతికి లోక్‌సభ సంతాపం ప్రకటించింది.

స‌మావేశాల ప్రారంభానికి ముందు ప్ర‌ధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఓపెన్ మైండ్‌తో అన్ని అంశాల‌ను చ‌ర్చించాల‌ని మోదీ సూచించారు. ఇది చాలా కీల‌క‌మైన స‌మ‌య‌మ‌ని, ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేళ ఇది అని, రాబోయే 15వ ఆగ‌స్టుకు ప్ర‌త్యేక‌త ఉంద‌ని, మ‌రో 25 ఏళ్ల‌లో వంద‌వ స్వాతంత్య్ర దినోత్స‌వం జ‌రుపుకుంటామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో బ‌ల‌మైన నిర్ణ‌యాలు తీసుకోవాల‌న్నారు. ఈ స‌మావేశాలు ఫ‌ల‌ప్ర‌దం కావాలంటే ఎంపీలంద‌రూ చ‌ర్చ‌ల్లో పాల్గొనాల‌న్నారు.

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఈరోజు (సోమవారం) నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 26 రోజుల్లో 18 సార్లు సభా కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సెషన్‌లోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 31 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అదేవిధంగా కాలం చెల్లినవి పేర్కొంటూ 71 చట్టాలను తొలగించనున్నారు.

అయితే బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్న వేళ.. సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. బిల్లులపై చర్చించి ఆమోదం పొందేలా చూడాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ధరల పెరుగుదల, అగ్నిపథ్‌ సహా అనేక సమస్యలను లేవనెత్తనున్నాయి. కాగా, ప్రతిపక్షాలు సహకరించినా, సహకరించకపోయినా రోజుకు రెండు బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *