ప్రతిసారీ కాపులను, ప్రజలను తిట్టడం పవన్ కళ్యాణ్ కు పరిపాటిగా మారిందని, ఆయన కాపులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తనను గెలిపించనందుకు నెపం మొత్తం కాపులపై, ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు. అసలు కాపులకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించాడో చెప్పాలని ప్రశ్నించారు. పట్టుమని పదిరోజులు వరుసగా, హైదరాబాద్ షూటింగ్ కు వెళ్ళకుండా ప్రజల్లో తిరిగాడా అని నిలదీశారు. ఏదో రెండురోజులు రావడం, జగన్ ను తిట్టడం, వెళ్ళి మళ్ళీ షూటింగ్ చేసుకుంటారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
పవన్ ఇప్పటికైనా తన ముసుగు తొలగించాలని, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తామని ముందునుంచీ చెప్పాలనే తాము డిమాండ్ చేస్తూ వచ్చామని పేర్ని గుర్తు చేశారు. అసలు పోటీ చేయకుండా చంద్రబాబు బస్సెక్కి తిరిగినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తమకేం సంబంధం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రైతుల పరామర్శకోసం షూటింగ్ ఆపి వచ్చానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ తానొక్కడే తెలివైనవాడని అనుకుంటున్నారని, కానీ ఆయన వచ్చింది బాబుకోసమని, రాజకీయాలు చేయడం కోసమని ఎద్దేవా చేశారు. ఎప్పటికప్పుడు అతి త్వరలో రాష్ట్రమంతా పర్యటిస్తా అని చెబుతున్నారని, టీ టైం యజమాని కోటి రూపాయల ఖర్చుతో వారాహి తయారు చేసి ఇస్తే, దానికి దుర్గమ్మ దగ్గర పూజలు కూడా చేయించి తిరగకుండా పక్కన పెట్టారని నాని విమర్శించారు.
కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి చేయలేకపోతే చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని,నోటికి ఎందుకు తాళం వేసుకొని కూర్చున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పవన్ సినిమా మార్కెట్ ఎంత, ఇప్పటివరకూ ఏపీ, తెలంగాణలో వంద కోట్ల రూపాయలు దాటినా సినిమా ఏదైనా ఉందా, అసలు ఆయన సినిమా లెక్కలు బైటపెట్టే ధైర్యం ఉందా అని నాని అడిగారు.