పవన్ కళ్యాణ్ చచ్చు రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ విమర్శించారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ ఒకవైపు కేంద్రంలోని బీజేపీతో ఉంటారని, మరోవైపు బీజేపీకి బద్ధ శత్రువు అయిన టీడీపీకి కొమ్ము కాస్తుంటారని..ఇదేమి రాజకీయమని అడిగారు. తన ఎంపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పవన్, చంద్రబాబులపై భరత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
పవన్ మద్దుతు బీజేపీకా, టీడీపీకా అనేది స్పష్టం చేయాలని, ముసుగులో గుద్దులాట ఎందుకని భరత్ ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి రైతుల ముసుగులో పాదయాత్ర డ్రామా ఆడిస్తుంటే, ఈ ప్యాకేజీ స్టార్ ఆ డ్రామా పాదయాత్రకు మద్దతుగా జనవాణి పేరుతో కార్యక్రమం పెట్టుకోవడం ఏమిటని, ప్రజలంత అమాయకులు కారని, అన్నిటినీ నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. సినిమా ఫీల్డ్ లో కంటే ఎక్కువ అందుతోంది కాబట్టే తాను టీడీపీకి వత్తాసు పలుకుతున్నట్టు పవన్ నేరుగా చెప్పొచ్చని భరత్ ఎద్దేవా చేశారు. కొంతమంది ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తారు.. మరికొంతమంది సంపాదించుకునేందుకు వస్తారు.. మీరు రెండవ కోవకు చెందిన వారేమోనని ప్రజలు భావిస్తున్నారని ఎంపీ వ్యాఖ్యానించారు.
ప్రజలను వంచించడానికి, మభ్యపరచడానికి చంద్రబాబు చేస్తున్న అన్ని కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జగన్ రాజకీయ విజ్ఞతతో కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్ట్స్ మంజూరు చేయించుకుంటున్నారని ఎంపీ చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నది వైసీపీ ప్రభుత్వమేనని, అందుకే గడప గడపకూ కార్యక్రమంలో ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామని, రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నడుస్తోందని భరత్ వివరించారు.
Also Read : దేనికి గర్జనలు?: జనసేనాని వరుస ట్వీట్లు